Hydra Commissioner Ranganath Clarify On Demolitions : రాష్ట్ర రాజధానిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఇప్పటికే నిర్మించి ఉన్న నివాసాలను కూల్చబోమని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొత్త నిర్మాణాలు చేపడితే కచ్చితంగా కూల్చివేస్తామని వెల్లడించారు. మాదాపూర్ సున్నంచెరువు, దుండిగల్ మల్లంపేట చెరువుల పరిధిలోని నివాసాల కూల్చివేతపై నిరసనలు వ్యక్తమవడంతో స్పందించిన రంగనాథ్, ఆ నిర్మాణాలన్నీ అక్రమమని నిర్ధారించడం వల్లే హైడ్రా చర్యలు తీసుకుందన్నారు.
మల్లంపేట కత్వా చెరువులో ఎలాంటి అనుమతి లేకుండా విల్లాలు నిర్మించారని, పంచాయతీ నుంచి నకిలీ అనుమతులు పొందారని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ తనకు నివేదిక సమర్పించినట్లు రంగనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం కూల్చివేసిన విల్లాలన్నీ రెండేళ్ల కిందట సీజ్ చేశారని, అందులోకి ఎవరూ రాలేదని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా తప్పుడు ఆధారాలు సమర్పించి నిర్మాణాలు చేపట్టారని, ఇందుకు కారణమైన బిల్డర్ లేడీ డాన్ విజయలక్ష్మిపైనా క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Hydra Focus On Illegal Constructions : స్థానిక రాజకీయ నాయకుల పలుకుబడి ఉపయోగించుకొని విజయలక్ష్మి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, ఆమెపై గతంలో కూడా క్రిమినల్ కేసులు ఉన్నట్లు రంగనాథ్ వివరించారు. అలాగే అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని 51 ఎకరాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, అలాగే రోడ్లను సైతం ఆక్రమిస్తూ పద్మావతి నగర్‌లో ఏర్పాటు చేసిన అక్రమ లే అవుట్‌కు సంబంధించిన ప్రహరీ గోడతో పాటు రెండు సెక్యూరిటీ గదులను తొలగించామని రంగనాథ్ తెలిపారు.
ఈ నిర్మాణాలు కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందినవిగా తేలిందని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు రంగనాథ్ వివరించారు. మాదాపూర్‌లోని సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పదెకరాల చెరువు భూమిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెరువులను ఆక్రమించడంలో ఆక్రమణదారులు వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు హైడ్రా గుర్తించిందన్నారు.
స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమణలు : మొదట భవన నిర్మాణ వ్యర్థాలతో చెరువులను పూడుస్తున్నారని, వాటిని చదును చేసి చిన్న చిన్నషెడ్లను నిర్మించి పార్కింగ్ కోసం వినియోగిస్తున్నట్లు రంగనాథ్ తెలిపారు. ఇందుకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు సైతం ఉంటున్నాయని పేర్కొన్నారు. మాదాపూర్ సున్నం చెరువులో గోపాల్ అనే వ్యక్తి చెరువు భూమిని ఆక్రమించి షెడ్లు వేసి అద్దెకు ఇచ్చాడని, అతనిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న ఇళ్లు, ప్లాటు, భూమి కొనుగోలు చేయవద్దు : గతంలో కూల్చివేతలు చేపట్టిన చోట ఎలాంటి అనుమతులు లేకుండానే మళ్లీ కొత్త భవనాలను వెలుస్తున్నాయని, వాటిపై హైడ్రా దృష్టి సారించినట్లు రంగనాథ్ తెలిపారు. చెరువులన్నీ ఆక్రమణలకు గురై హైదరాబాద్ చిత్రపటం నుంచి క్రమంగా కనుమరుగవుతున్నాయన్నారు. ఈ విషయంలో హైడ్రా మరింత కఠినంగా వ్యవహారించనున్నట్లు పేర్కొన్న రంగనాథ్, చెరువు ఆక్రమిత స్థలాల్లో ఇప్పటికే నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్న వాటిని కూల్చబోమని, కొత్తగా నిర్మించే వాటిని, నిర్మాణ దశలో ఉన్న వాటిని మాత్రం హైడ్రా కూల్చివేస్తుందని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలోని భూములు, ప్లాట్లు, ఇళ్లను ప్రజలెవరూ కొనుగోలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
హైడ్రా దూకుడు - ఒకే రోజు మూడుచోట్ల అక్రమ నిర్మాణాల కూల్చివేత - hydra demolish illegal assets