Hyderabad Child Missed At 12 Years And Police Found After 10 Years in Uttar Pradesh : ఏళ్ల తరబడి కనిపించకుండా అదృశ్యమై పోయిన పలువురిని తెలంగాణ మహిళా భద్రత విభాగం అధీనంలోని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, ఏహెచ్‌టీయూ) పోలీసులు గుర్తిస్తున్నారు. చాలాకాలంగా కనిపించకుండా పోయిన వారిని గుర్తించేందుకు ఏహెచ్‌టీయూతోపాటు ఇదే విభాగంలోని షీ సైబర్ ల్యాబ్ కృషి చేసిందని, ఈ క్రమంలోనే 27 కేసులు కొలిక్కివచ్చాయని మహిళా భద్రత విభాగం డీజీపీ శిఖాగోయెల్ వెల్లడించారు.
‘తెలంగాణలో 2024 నవంబరు నాటికి 22,870 అదృశ్యం కేసులు నమోదు అయ్యాయని, వాటిలో 19,191 కేసులు కొలిక్కివచ్చాయని తెలిపారు. కేసులను కొలిక్కి తీసుకురావడంతో జాతీయ స్థాయి సగటు 51.5 శాతం కాగా తెలంగాణాది 84.25 శాతం’ అని శిఖాగోయెల్ తెలిపారు.
12 ఏళ్లప్పుడు ఖలీల్‌ఘోరి ఇప్పుడు అభినవ్‌సింగ్ : హైదరాబాద్ కంచన్‌బాగ్‌కు చెందిన 12 ఏళ్ల మహ్మద్ ఖలీల్‌ఘోరి 2014 ఆగస్టు 18న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు వెతికినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే కేసును ఏహెచ్‌టీయూ (AHTU)కు బదిలీ చేశారు. ఓపెన్-సోర్స్ టూల్స్ పరిజ్ఞానంతో దర్యాప్తు ఆరంభించిన అధికారులు ఖలీల్‌ఘోరి ఆధార్‌కార్డు కొత్త మొబైల్ నంబరుతో అప్‌డేట్ అయినట్లు గుర్తించారు. ఆ ఫోన్ నంబరు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం కాన్పుర్‌లోని ప్రయాగరాజ్‌కు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి సనేహీసింగ్‌దిగా నిర్ధారించుకున్నారు.
"ఎంతపని చేశావు స్వరూపా" - ఇంటికి వెళ్లి చాక్లెట్ ఇచ్చి నమ్మించావుగా!
దాని ఆధారంగా ఆరా తీయడంతో ఖలీల్‌ఘోరి ఆచూకీ లభించింది. హైదరాబాద్ నుంచి రైల్లో కాన్పుర్ వెళ్లిన ఖలీల్‌ఘోరి అక్కడి రైల్వేస్టేషన్‌లో తచ్చాడుతున్న క్రమంలో చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌కు తరలించినట్టు, 2022 వరకు అందులోనే ఉన్న అతన్ని సనేహీసింగ్ దత్తత తీసుకొని అభినవ్‌సింగ్‌గా పేరు మార్చినట్లు దర్యాప్తు క్రమంలో తేల్చారు. ఈ మేరకు ప్రత్యేక బృందం కాన్పుర్‌కు వెళ్లి అతడిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించింది.
నిజామాద్‌లో గంగ ఆచూకీ : హైదరాబాద్ నాచారంలోని శాంతిసదన్ ప్రాంతం నుంచి పదకొండేళ్ల గంగ 2015 అక్టోబరు 30న అదృశ్యమైంది. అప్పట్లో గంగ బెలూన్లు అమ్మేదనే సమాచారం మాత్రమే ఉండటంతో దాని ఆధారంగా దర్యాప్తు ఆరంభించారు. దర్యాప్తు బృందం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బెలూన్లు విక్రయించే వారి కోసం ఆరా తీసింది. చివరకు నిజామాబాద్‌లో తనిఖీ చేస్తున్న క్రమంలో భర్తతోపాటు బెలూన్లు విక్రయిస్తూ గంగ కనిపించిందని, భర్త, ఇద్దరు పిల్లలతో నాలుగేళ్లుగా నిజామాబాద్‌లోనే ఉన్నట్లు తేలిందని అధికారులు వెల్లడించారు.
ఇక్కడ ఇంటి నుంచి తప్పిపోయారు అక్కడ దొరికారు : హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన 10 ఏళ్ల బాలిక, 8 ఏళ్ల బాలుడు 2017 జులై 5న ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. దర్యాప్తు ఆరంభించిన షీ సైబర్ ల్యాబ్, ఏహెచ్‌టీయూ బృందం ఓపెన్ సోర్స్ టూల్స్‌ను వినియోగించి దర్యాప్తు చేపట్టారు. డిజిటల్ గుర్తింపుల ఆధారంగా వెతికి వారిద్దరూ బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి నగరానికి తీసుకొచ్చారు.
మేకలతో అడవికి వెళ్లిన రైతు - తిరిగి రాకపోవడంతో ఉలిక్కిపడిన గ్రామస్థులు