Nara Lokesh Praja Darbar: మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న 'ప్రజాదర్బార్'కు అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఉదయం 7గంటలకే వందలాదిమంది ప్రజలు వినతిపత్రాలతో ఇంటివద్ద బారులు తీరుతున్నారు. మంగళగిరి ప్రజలను తమ కుటుంబసభ్యులుగా భావించే లోకేశ్ ప్రతిఒక్కరి సమస్యను వింటూ నేనున్నానని భరోసా ఇస్తున్నారు.
అంగన్వాడీలు, ఉపాధ్యాయులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకువచ్చారు. జీతాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు, బదిలీల కోసం ఉపాధ్యాయులు, ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి. విద్య, వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరారు. వైఎస్సార్సీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములను బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని బాధితులు లోకేశ్ ఎదుట వారి గోడు వెళ్లబోసుకున్నారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న లోకేశ్ సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతానంటూ భరోసా ఇవ్వటంతో మంగళగిరి ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఎట్టకేలకు తొలగిన ఆంక్షలు- తాడేపల్లి పరిసర ప్రజల్లో ఆనందోత్సాహాలు - Tadepalli Palace Road
మరోవైపు యువగళం పాదయాత్రలో తన సమస్య చెప్పుకున్న ఏలూరుకు చెందిన అనూషని గుర్తుపట్టి, తన సమస్య పరిష్కారానికి మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. ఏలూరు యువగళంలో లోకేశ్‌ను కలిసి వైఎస్సార్సీపీ నేతలు తన ఇల్లు కబ్జా చేశారని అనూష లోకేశ్‌కు చెప్పుకుంది. అధికారంలోకి రాగానే సమస్య పరిష్కరిస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. ఇవాళ ప్రజాదర్బార్‌కు వచ్చిన అనూషను గుర్తుపట్టి లోకేశ్ పలకరించారు. ఇక నీ సమస్య తీరిపోయినట్లేనంటూ అనూషతో లోకేశ్ అన్నారు. లోకేశ్ భరోసా పట్ల అనూష హర్షం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా పోలీసు ఉన్నతాధికారులు తన భద్రత కంటే ప్రజా భద్రతపైనే దృష్టి పెట్టాలని లోకేశ్ ఆదేశించారు. మంగళగిరి అంజుమన్-యి- హిమాయతుల్ ఇస్లాం ఈద్గాలో బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొనడానికి ఆయన వెళ్లారు. భద్రతా విధుల్లో పలువురు ఉన్నతాధికారులు ఉన్న విషయాన్ని గమనించిన లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు ఎప్పుడూ కల్పించే భద్రత కల్పిస్తే చాలని, ఉన్నతాధికారులు తన భద్రతా విధుల్లో పాల్గొనవద్దని ప్రజా భద్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. మంగళగిరిలో ప్రధాన సమస్యగా ఉన్న గంజాయిని 100 రోజుల్లో పూర్తిగా అరికట్టే బాధ్యత తీసుకోవాలని, మహిళలకు రక్షణ, శాంతి భద్రతలు, ఇతర ముఖ్యమైన అంశాలపై మాత్రమే ఉన్నతాధికారులు పనిచేయాలని లోకేశ్ ఆదేశించారు.