Lokesh Praja Darbar 29th Day : మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు భారీగా స్పందన వస్తోంది. ఏపీ వ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. తెల్లవారుజామునుంచే ఆయనను కలిసేందుకు జనం బారులు తీరుతున్నారు. మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ 29వ రోజు లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహించారు.
Huge Response to Lokesh Praja Darbar : ఈ సందర్భంగా ప్రజల నుంచి పెద్దఎత్తున వినతులు వెల్లువెత్తాయి. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ అందించాలని, వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని, భూ కబ్జాదారులను తరిమివేయాలని, సొంతింటి కల నెరవేర్చాలని, విద్య, ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని బాధితులు లోకేశ్‌కు విజ్ఞప్తి శారు. వైఎస్సార్సీపీ రౌడీలు తన గొంతుపై కత్తిపెట్టి ఇంటిని, పొలాన్ని కబ్జా చేశారని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రిటైర్డ్ లోకోపైలట్ పిల్లి అబ్రహాం, ఆయన కుమార్తె పిల్లి సుధారాణి వాపోయారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గుంటూరు జిల్లా నారాకోడూరుకు చెందిన కోడూర్ వినోద్‌కుమార్ లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా కోనాడ జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు, నైట్ వాచ్మెన్ సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్, సభ్యులు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. వెెంటనే వారిని తొలగించాలని వారు కోరారు.
బాధితులకు భరోసా గత ప్రభుత్వంలో టీడీపీ సానుభూతిపరులనే నెపంతో 14 మందిపై అక్రమంగా నమోదు చేశారని విజయనగరం జిల్లా వెల్దూరు గ్రామ సర్పంచ్ నాయన సత్యవతి లోకేశ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆ కేసులను ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరి నుంచి విన్నపాలు స్వీకరించిన లోకేశ్ వాటి పరిష్కరానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఈ క్రమంలోనే పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలకు భరోసా కల్పిస్తోన్న ప్రజాదర్బార్ - నేనున్నానంటున్న నారా లోకేశ్ - Nara Lokesh Prajadarbar