Lokesh Praja Darbar 24th Day : ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు అనూహ్య స్పందన వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. తెల్లవారుజామునుంచే ఆయనను కలిసేందుకు జనం బారులు తీరుతున్నారు. మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ 24వ రోజు లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహించారు.
Huge Response to Lokesh Prajadarbar : ఈ సందర్భంగా ప్రజల నుంచి పెద్దఎత్తున వినతులు వెల్లువెత్తాయి. వంశపారంపర్యంగా తమకు సంక్రమించిన భూములను గత ప్రభుత్వ అండతో వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేశారని కొందరు బాధితులు ఆరోపించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వారు లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు వైఎస్సార్సీపీ నేత నాదెండ్ల చంద్రమౌళి తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన పెరుమాళ్ల మోహన్‌రావు వాపోయారు. అతడిపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా విదేశీ విద్య సాయం అందించాలంటూ పలు వినతులు వచ్చాయి. ఆటో కార్మికుల కోసం ఎంఎస్ఎమ్ఈ ఆటో పార్క్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరి నుంచి విన్నపాలు స్వీకరించిన లోకేశ్ వాటి పరిష్కరానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిబ్బందికి ఆయన ఆదేశాలు ఇచ్చారు.
రెండేళ్లుగా రాని జీతాలు - 24 గంటల్లో పరిష్కారం చూపిన మంత్రి లోకేశ్ - lokesh Prajadarbar