Huge Land Kabza By YSRCP Leaders in Visakhapatnam : విశాఖ జిల్లా ఆనందపురం మండలం వేములవలస రెవెన్యూ గ్రామ పరిధిలో సుమారు 8.52 ఎకరాల ప్రభుత్వ భూమిని తమ గుప్పెట్లోకి తీసుకునేందుకు వైఎస్సార్సీపీ నాయకులు ప్రణాళిక రచించారు. జాతీయ రహదారి చెంతనే అధికార అండతో కబ్జాకు వ్యూహ రచన చేశారు. ప్రభుత్వం ప్రకటించిన డి-పట్టాల క్రమబద్ధీకరణ అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. ఇక్కడ ఎకరా ధర దాదాపు రూ. 10 కోట్లపైనే పలుకుతుండగా దాదాపు రూ. 100 కోట్ల భూమిపై కన్నేశారు. అక్రమార్కులకు కొందరు అధికారుల సహకారం ఉన్నట్లు సమాచారం.
రౌడీల్ని అడ్డం పెట్టుకుని స్థిరాస్తి వ్యాపారం - విశాఖలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత
YSRCP Leaders Illegal Land Grab in Visakha : వారం రోజులుగా సర్వే నెంబరు 129లో భారీ యంత్రాలతో చదును చేయడం, చుట్టూ రక్షణగా స్తంభాలు ఏర్పాటు చేయడంతో పాటు రేకుల షెడ్డు నిర్మాణం జరిగింది. దీన్ని కొందరు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారికి నోటీసులు జారీ చేస్తామని తహసీల్దార్ చెప్పినా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. జల ప్రవాహానికి సంబంధించిన గెడ్డవాగును పూర్తిగా చదును చేసి, స్వరూపాన్ని మార్చేస్తుంటే రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థలాన్ని, సంబంధిత భూ దస్త్రాలను సిబ్బంది పరిశీలించారన్న ఆనందపురం తహసీల్దార్ హేమంత్‌కుమార్ భూమి పూర్తిగా ప్రభుత్వ గెడ్డవాగు, గెడ్డ పోరంబోకు భూమిగా ఉందన్నారు. ప్రభుత్వ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు.
YSRCP Leaders Illegal Activities in state : డి-నోటిఫికేషన్ ద్వారా డి-పట్టాలకు పూర్తి హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే అదనుగా దళారులు రంగ ప్రవేశం మొదలయ్యింది. వేములవలస సహా, మండల పరిధిలో పలు గ్రామాల్లో డి-పట్టా భూముల కొనుగోలు ప్రక్రియ జోరందుకుంది. ఈ క్రమంలో రెవెన్యూ దస్త్రాలపై అవగాహన కల్గిన ఓ రాజకీయ నాయకుడు గతంలో సృష్టించిన పట్టాలతో సర్వే చేయించారు. దీంతో అప్పటి వరకు అందరికి చెరువుగా తెలిసిన భూమి కాస్తా డి-పట్టాగా చెప్పుకొచ్చారు. రాత్రికి రాత్రే ఆ నేలను చదును చేసి చుట్టూ ప్రహరీ కట్టి అందులో మొక్కలు నాటేశారు. ఈ వ్యవహారంలో ఆనందపురం మండలానికి చెందిన ఇద్దరు కీలక నేతల పేర్లు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.