High Court Hearing on Coal Stock in Visakha Steel Plant : నిర్వాసిత కార్మికుల సమ్మె కారణంగా అదానీ గంగవరం పోర్టు నుంచి విశాఖ స్టీల్ ప్లాంటుకు రావాల్సిన బొగ్గు సరఫరాకు అవరోధం కలుగుతోందని స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె. వెంకట దుర్గాప్రసాద్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ప్లాంటుకు బొగ్గు సరఫరా జరిగేందుకు చర్యలు తీసుకునేలా విశాఖ కలెక్టర్‌ను ఆదేశించాలని కోరారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది అంబటి శ్రీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. అదానీ గంగవరం పోర్టులో కార్మికుల సమ్మెతో ఉక్కు పరిశ్రమకు వెళ్లాల్సిన బొగ్గు సరఫరా నిలిచిపోయిందని కోర్టుకు వివరించారు.
స్టీల్ ప్లాంటులోని మూడు ఫర్నెస్‌లలో ఒకటే పనిచేస్తోందని బొగ్గు నిల్వలు లేకపోతే ప్లాంటు మూతపడి వేలమంది కార్మికుల, ఉద్యోగుల జీవనోపాధి దెబ్బతింటుందని కోర్టు దృష్టికి తెచ్చారు. విశాఖ కలెక్టర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని పోర్టు యాజమాన్యానికి కలెక్టర్ సూచించారన్నారు. ఎన్నికల విధుల్లో ప్రస్తుతం తీరిక లేకుండా ఉన్నట్లు తెలిపారు.
అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపించారు. విశాఖ స్టీల్ ప్లాంటుకు చెందిన 27 లక్షల టన్నుల బొగ్గునిల్వలు గంగవరం పోర్టులో ఉన్నాయి. 80వేల టన్నుల బొగ్గుతో ఉన్న ఓడను విశాఖ పోర్టుకు ఇప్పటికే తరలించాం. మరో ఓడ అన్లోడ్ కాకుండా గంగవరం పోర్టులో ఉంది. కార్మికుల ఆందోళనలతో గేట్లు మూసేసి లోపలికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఫలితంగా కార్యకలాపాలు నిలిచిపోయి రోజుకు 5 కోట్ల నష్టం వస్తుందని వాదించారు. శాంతిభద్రతల సమస్య ఏర్పడినా పోలీసులు పట్టించుకోవడం లేదని హైకోర్టుకు తెలిపారు.
జోక్యం చేసుకున్న హైకోర్టు విశాఖ స్టీల్‌ప్లాంటుకు బొగ్గు సరఫరా చేసేందుకు అదానీ గంగవరం పోర్టులో ఉన్న బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించాలని అదానీ పోర్టు యాజమాన్యాన్ని ఆదేశించింది. బొగ్గు సమస్యకు పరిష్కారం చూపాలంటూ ఎస్‌కు స్టీల్‌ప్లాంటు సీఎమ్‌డీ లేఖ రాశారని గుర్తు చేసింది. వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. సీఎస్, విశాఖ పోలీసు కమిషనర్‌ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. వారి వాదన విన్నాక తగిన ఆదేశాలు ఇచ్చేందుకు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. జయసూర్య గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.