Avinash Reddy bail petition: అవినాష్ రెడ్డి బెయిల్ పై బయట ఉంటే వివేకా హత్య కేసు దర్యాప్తు ప్రభావితమవుతోందని సాక్ష్యులను భయపెడుతున్నారని పిటీషనర్ దస్తగిరి తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. వెంటనే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి వేసిన పిటీషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు.
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటీషన్‌లో ఎలాంటి రాజకీయ ప్రొద్బలం లేదని దస్తగిరి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2023 మేలో అవినాష్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, 11 నెలల తర్వాత బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశామని కోర్టుకు తెలిపారు. ఒకవేళ రాజకీయ ప్రొద్బలం వెంటనే హైకోర్టును సంప్రదించే వాళ్లమని ఆయన అన్నారు. దస్తగిరి, ఆయన భార్య, తండ్రిపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడికి దిగారని జడ శ్రవణ్ కోర్టు తెలిపారు. 10 నెలల పాటు ఈ దాడులను భరించిన దస్తగిరి హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని దస్తగిరిని అవినాష్ రెడ్డి మభ్య పెట్టాడని, చైతన్యరెడ్డి జైలుకు వెళ్లి 20 కోట్లు ఇస్తామని చెప్పాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
జైలులో మెడికల్ క్యాంపు పేరుతో వెళ్లి చైతన్యరెడ్డి, దస్తగిరిని కలిశాడన్నారు. అధికార బలాన్ని ఉపయోగించుకొని జైలు అధికారులు, పోలీసులతో కుమ్ముక్కైన అవినాష్ రెడ్డి సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారన్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయకపోతే బాధితులకు న్యాయం జరగదని జడ శ్రవణ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. దస్తగిరిని, అతని కుటుంబాన్ని అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నట్లు గతేడాది డిసెంబర్‌లో ఆయన భార్య ఫిర్యాదు చేసిందని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
సాక్ష్యులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేస్తున్నాడని, దర్యాప్తును ప్రభావితం చేసేలా పలు చర్యలకు పాల్పడుతున్నాడని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వెంటనే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అవినాష్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఈ కేసులో ఆయనే ప్రధాన సూత్రధారని సునీత తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేసును ప్రభావితం చేస్తున్నాడని, వెంటనే బెయిల్ రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. అవినాష్ రెడ్డి బెయిల్‌పై బయట ఉండే అర్హత లేదన్నారు. దస్తగిరి వేసిన పిటీషన్‌కు అర్హత లేదని, పిటీషన్‌ను కొట్టివేయాలని అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.