Heavy Traffic Jam on Vijayawada Highway Today : రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు రావడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. తమ అభిమాన నేతలను గెలిపించుకునేందుకు కుటుంబాలతో సహా బయలుదేరారు. పెద్దసంఖ్యలో జనం తరలివెళ్తుండటంతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. చాలామంది సొంత వాహనాల్లో బయల్దేరడంతో రహదారులు, టోల్‌ప్లాజాల వద్ద రద్దీ నెలకొంది.
ఈ క్రమంలోనే ఎల్బీనగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. ఎల్బీనగర్ నుంచి పనామా వరకు వాహనాలు నెమ్మదిగా సాగాయి. ఓటర్లు ఏపీతో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట వైపు వెళ్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు విజయవాడ హైవేపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
అలాగే రామచంద్రాపురం, బీరంగూడ, అశోక్‌నగర్, బొల్లారం ప్రాంతాల నుంచి ఓటర్లు ఓటువేసేందుకు తమ ఊళ్లకు తరలివెళ్తున్నారు. ఎల్బీనగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, మదీనాగుడ, చందానగర్ ప్రాంతాల్లో బస్సుల కోసం ప్రయాణికులు గంటలకొద్ది పడిగాపులు కాస్తున్నారు. బస్సుల్లో సీట్లు దొరడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ బస్సులైతే ఏకంగా 3 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. మరోవైపు ఎన్ని ఇబ్బందులు పడినా స్వస్థలాలకు వెళ్లి ఓటుహక్కును వినియోగించుకొని, తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటామని పలువురు తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఓటర్లు - బస్సులు లేక అవస్థలు - Bus congestion in AP
మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. గత రెండు రోజుల నుంచి భారీగా వాహనాలు ఏపీకి వెళ్తున్నాయి. దీంతో టోల్ ప్లాజా సిబ్బంది 16 టోల్ చెల్లింపు కేంద్రాలకు గాను, విజయవాడ వైపు 9 గేట్లను తెరిచారు. దాదాపు 95 శాతం వాహనాలు ఇప్పటికే ఫాస్టాగ్ ఏర్పాటు చేసుకోవడంతో నిమిషాల వ్యవధిలోనే టోల్ గేట్ల నుంచి బయటకు వెళ్లిపోతున్నాయి
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లేవారితో విజయవాడ బస్టాండ్ రద్దీగా మారింది. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి అతికష్టం మీద విజయవాడకు చేరుకున్నా అక్కడి నుంచి స్వగ్రామాలకు వెళ్లడం మరింత నరకప్రాయంగా మారింది. రద్దీకి తగ్గట్లు బస్సులు నడపలేక ఆర్టీసీ యాజమాన్యం చేతులెత్తేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 45 ప్రత్యేక బస్సులను మాత్రమే ఆర్టీసీ ఏర్పాటు చేసింది. గుంటూరు 18, మచిలీపట్నం 23, ఏలూరు 20, పశ్చిమ గోదావరి 16, తూర్పుగోదావరికి 7, అమలాపురం 8, కాకినాడ 8, అనకాపల్లికి 1 ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సుల్లో రిజర్వేషన్ సదుపాయం ఆర్టీసీ ఏర్పాటు చేయలేదు.
దసరా, సంక్రాంతి పండుగలకు వచ్చినట్లు ఓట్ల పండుగకు ప్రజలు తరలివస్తున్నా ఆర్టీసీ రవాణా సదుపాయాలు కల్పించలేదు. బస్ స్టాండ్లలో బస్సుల కోసం ఆర్టీసీ ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. ఏపీలో ప్రధాన నగరాల నుంచి జిల్లాలకు, గ్రామాలకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయలేదు. సరిపడా బస్సుల్లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పోనీ ప్రైవేట్ వాహనాల్లో వెళ్దామంటే ఛార్జీల బాదుడుతో వెనక్కి తగ్గుతున్నారు. ఎలాగైనా ఓటు వేద్దామన్న సంకల్పంతో బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం,ఏలూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు బస్సుల కొరత ఏర్పడింది. ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు బస్సులు సరిపడా లేవు. రెగ్యులర్ సర్వీసులు ఏ మాత్రం సరిపోవడంలేదు. ఏ ప్రాంతానికీ ప్రత్యేక బస్సులు తిరగడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. రిజర్వేషన్ కేంద్రాల వద్ద ప్రయాణికులు భారీ క్యూ , అవస్తలు పడుతున్నారు.
కనీసం రిజర్వేషన్ కేంద్రాల సంఖ్యను, సిబ్బందిని ఆర్టీసీ అధికారులు పెంచలేదు. ఆర్టీసీ తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. బస్సులు లేక ఉదయం 5 గంటల నుంచీ బస్టాండ్ లోనే వేలాదిమంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.