Rain Effect in Alluri District: అల్లూరి జిల్లా జిల్లా మన్యంలో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రంపచోడవరం మండలం భూపతి పాలెం, ముసురుమీల్లి, సూరంపాలెం, మద్దిగడ్డ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. రంపచోడవరం మండలం బందపల్లి నుంచి వాడపల్లి వెళ్లే రహదారిలో కొండ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గిరిజన గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోవటంతో రంపచోడవరం ఐటీడీఏ అధికారులు వరద సహాయక చర్యలు చేపట్టారు.
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అల్లూరి జిల్లాలోని పలు మండలాల్లో వందల ఎకరాల వరి పంట నీటమునిగింది. అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగూడు మండలాల్లో పంటలు పెద్దఎత్తున నీటిపాలయ్యాయి. ఆరుగాలం శ్రమించి, సాగుచేసిన పంట కళ్లముందే నాశనమవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతగిరి మండలంలోని కాశీపట్నంలో గోస్తని నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షాలకు పాడేరు జిల్లాలోని డుడుమ జలాశయంలో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. 2,590 అడుగుల సామర్థ్యం ఉన్న ఈ జలాశయంలో నీటిమట్టం 2,589.5 అడుగులకు చేరింది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డుడుమా నుంచి వస్తున్న నీటితో దిగువన ఉన్న బలిమెలా జలాశయం నిండుకుండలా మారింది. జోలాపుట్ జలాశయంలో ఒక్కరోజు వ్యవధిలోనే 6అడుగుల మేరకు నీటి మట్టం పెరిగింది. 2,750 అడుగుల సామర్థ్యం గల జోలాపుట్లో ప్రస్తుతం నీటిమట్టం 2716 అడుగులు దాటింది.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొండ ప్రాంత వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి పరివాహక మండలాలైన చింతూరు, కూనవరం, వరరంభద్రపురం ప్రాంతాలు ఈ వరదల నుంచి ప్రజలను రక్షించటం మాకు ఓ ఛాలెంజ్ అని అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో వరదలు సహాయక చర్యలపై ఈటీవీ భారత్తో కలెక్టర్ మాట్లాడారు.