AP Rain Update : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తడిసిముద్దయింది. రెండు రోజులుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో జోరుగా వాన కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వన్‌టౌన్ రాజగిరివారి వీధిలోని కొండపై మట్టి జారిపోయి ఓ ఇల్లు పాక్షికంగా దెబ్బతింది.
నిలిచిన రాకపోకలు : ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగుకు వరద ఉద్ధృతి పెరిగింది. గంపలగూడెం మండలం వినగడప వద్ద రహదారి పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. గంపలగూడెం - చీమలపాడు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ, నూజివీడు వైపు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కట్టలేరు వాగు ఉద్ధృతిని కలెక్టర్ సృజన పరిశీలించారు.
బాపట్ల జిల్లాలో రాత్రి నుంచి జోరుగా వాన కురుస్తోంది. చీరాల, పర్చూరు, మార్టూరు, అద్దంకి, బాపట్ల ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. చీరాలలో రహదారులు చిత్తడిగా మారాయి. బాపట్లలో 12.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా చీరాలలో 7.6, పర్చూరులో 8.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
కూలిన భోగాపురం విమానాశ్రయ ప్రహరీగోడ : ఉత్తరాంధ్రలోనూ జోరుగా వానలు కురుస్తున్నాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మన్యం జిల్లాలో భారీగా వర్షపాతం నమోదైంది. మన్యం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భోగాపురం విమానాశ్రయ ప్రహరీ గోడ కూలింది. జమ్మయ్యపేట, కవులవాడ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు పొలాలను ముంచెత్తింది. నువ్వుల పంట దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పెరుగిన నీటిమట్టం : అనకాపల్లిలోనూ భారీ వర్షం కురిసింది. ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి వరద నీరు చేరి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. తాండవ జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. శారదా నదిలోకి వరద నీరు చేరుతోంది. జోరు వానలకు విశాఖలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అరకు మన్యంలోనూ జోరుగా వానలు కురుస్తున్నాయి.
CM Chandrababu Naidu Review on Rains : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షలో పాల్గొని, జిల్లాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అధికారులు పూర్తి అప్రమత్తంగా, డైనమిక్‌గా పని చేయాలని సూచించారు.