Heavy Flood Water Flow To Telangana Water Projects : తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు వంకలు నిండుకుండలా మారాయి. భారీ వర్షాలతో పలు ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం 20 అడుగులు ఉండగా ప్రస్తుతం 25 అడుగులకు చేరుకుంది. రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది.
పోటెత్తిన గోదావరి- పోలవరం నుంచి భారీగా నీటి విడుదల - GODAVARI FLOOD
ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద వస్తోంది. ఎగువన వస్తున్న ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 59 వేల 330 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలోని సీత వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి స్నానఘట్టాల వరకు నీరు చేరింది.
త్రివేణి సంగమం వద్ద జలకళ : నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1065.7 అడుగులుగా ఉంది. మొత్తం నీటినిల్వ సామర్థ్యం 16.405 టీఎంసీలు అయితే వరద నీరు చేరినందుకు 80.5 టీఎంసీలుగా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది. త్రివేణి సంగమం వద్ద ఉద్ధృతంగా గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం త్రివేణి సంగమం వద్ద 7 మీటర్ల పైగా ఎత్తులో వరద కొనసాగుతుంది.
గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. 22,877 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం నీటిమట్టం 315.850 మీటర్లుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా ఈరోజు ఉదయానికి 4.951 టీఎంసీలకు చేరింది.
ఏపీలో భారీ వర్షాలు - మరింత బలపడనున్న అల్పపీడనం - విపత్తుల సంస్థ హెచ్చరిక - Heavy Rains
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద పెరుగుతోంది. ప్రస్తుతం 1,93,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 85 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. 5,437 క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రాజెక్టులోకి వస్తుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 688.350 అడుగులుగా ఉంది. హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. నీటిమట్టం 513.21 అడుగులకు చేరింది. సంగారెడ్డిలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద నీరు స్వల్పంగా వచ్చి చేరుతోంది. 749 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 29.917 టీఎంసీలు అయితే ప్రస్తుతం నీటిమట్టం 13.586 టీఎంసీలుగా ఉంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం - రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు - AP Weather Update