Heavy Boats Removing at Prakasam Barrage: సెప్టెంబర్ 10 మధ్యాహ్నం ఒంటి గంటకు రెండు బాహుబలి క్రేన్లు ప్రకాశం బ్యారేజీ పైకి వచ్చాయి. ఇటీవల పడవలు ఢీకొన్న 67, 68 గేట్ల వద్ద ఆగాయి. టన్నులకొద్దీ బరువులను అవలీలగా లేపే ఈ క్రేన్ల భారీ కొక్కాలు, హైడ్రాలిక్స్ బ్యారేజీని దాటుకుంటూ పడవ వద్ద దిగాయి. గేట్ల కింద నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుండగా నడుముకు బెల్టులు ధరించిన సిబ్బంది క్రేన్ల సాయంతో పడవపై దిగారు. వంద టన్నుల బరువును తీయగలిగే ఉక్కుకడ్డీలతో అతి కష్టం మీద పడవకు ముందు, వెనుక భాగాల్లో కట్టారు. వాటిని క్రేన్ కొక్కాలకు తగిలించారు.
ఇక రెండు క్రేన్ల ఆపరేటర్లు ఒకేసారి పడవలను లిఫ్టు చేయడం ప్రారంభించారు. దీన్ని చూస్తున్న వారందరిలోనూ ఉత్కంఠ. భారీ క్రేన్లు కావడంతో ఇక పడవ పైకి లేవడం ఖాయమనుకున్నారు. కానీఇంజినీర్ల అంచనాలు తప్పాయి. పడవలు అంగుళం కూడా కదల్లేదు. ఒకేసారి 100 టన్నుల బరువును అవలీలగా ఎత్తగలిగేరెండు క్రేన్లూ పడవల్ని కదిలించలేకపోయాయి. 5 గంటల పాటు ప్రయత్నించినా నిరాశే ఎదురైంది. ఒక్క పడవనైనా తొలగిద్దామనుకున్నా అదీ సాధ్యపడలేదు.
రెండు భారీ క్రేన్లకు అదనంగా ఓ మోస్తరు బరువు లేపే మరో క్రేన్ నూ తెప్పించారు. మరో తీగతో పడవలను లాగే ఏర్పాటు చేశారు. 20 మంది సిబ్బంది బ్యారేజీ గేట్లపైకి దిగారు. అక్కడి నుంచి పడవ పైకెక్కి మరో కోణం వైపు మ్యూన్యువల్‌గా , లిఫ్టింగ్ యంత్రాలు పెట్టి పడవలను లాగడం ప్రారంభించారు. బ్యారేజీపై నుంచి రెండు భారీ క్రేన్లు, పక్కనుంచి మరో క్రేను, కింద సిబ్బంది ఇలా నాలుగు వైపుల నుంచీ లాగినా ప్రయోజనం లేదు. సాయంత్రం 6 గంటల వరకూ శ్రమించిన సిబ్బంది అలసట చెందారు . ప్లాన్-ఏ నిష్పలం అంటూ ఆపరేషన్ ఆపేశారు. ఒక్కో పడవ 40 టన్నుల బరువు ఉండడం, మూడు పడవలూ ఒకదానితో మరొకటి చిక్కుకుని ఉండడం వల్లే భారీ క్రేన్లు సైతం లేపలేకపోయాయని అధికారులు తెలిపారు.
సాయంత్రానికి పడవలను తొలగించాలి : ఎలాగైనా భారీ పడవలను బయటకు తీయాలనే లక్ష్యంతో అధికారులు ప్లాన్ బీని సిద్ధం చేశారు. పడవలను ముక్కలుగా కోసి బయటకు తీయడమే మార్గమని నిర్ణయించారు. దీని కోసం విశాఖ నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నారు. నదులు, సముద్రాల్లో సైతం దిగి అధునాతన కట్టర్లతో భారీ పడవలను కోసే నైపుణ్యం ఉన్న డైవింగ్ టీంలు రంగంలోకి దిగనున్నాయి. నదిలో పడవల్ని ముక్కలు చేసే పని ప్రారంభించనున్నారు. ఇందుకోసం 120 టన్నుల ఎయిర్ బెలూన్స్ పున్నమి ఘాట్ నుంచి భారీ పంటును సైతం తెస్తున్నారు. మూడు ముక్కలు చేశాక వాటిని, క్రేన్లు , పంట్ల సాయంతో బ్యారేజీ నుంచి బయటకు తేవాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ సాయంత్రానికి భారీ పడవలను తొలగించాలని భావిస్తున్నారు.
పడవలను ముక్కలుగా చేసి బయటకు పంపే ప్రయత్నం నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందని ఇంజినీర్లు, అధికారులు ధీమాతో ఉన్నారు. బ్యారేజీ నిర్మాణం, గేట్లు, కౌంటర్ వెయిట్లకు, ఎక్కడా చిన్నపాటి నష్టం జరగకుండా అత్యంత సురక్షితంగా బోట్లను వెలికి తీస్తామని చెప్తున్నారు