HC on TDP sympathizers Village Eviction Case: రాజకీయ కక్షలతో టీడీపీ సానుభూతిపరులను గ్రామ బహిష్కరణ చేసిన వైసీపీ నేతల కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్స్ తరఫు న్యాయవాదుల వాదనలపై హైకోర్టు ఏకీభవించింది. బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని, గ్రామంలో ప్రశాంత జీవనం కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకి వెళ్తే: పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలను రాజకీయ కక్షలతో 2019లో వైసీపీ నేతలు నగర బహిష్కరణ చేశారు. దీంతో బాధిత కుటుంబాలు కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. 2019లో వైసీపీ అధికారం చేపట్టిన తరువాత టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలపై వైసీపీ నేతలు దాడి చేసి, గ్రామ బహిష్కరణ చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.
దళిత యువకుల శిరోముండనం కేసు - హైకోర్టులో విచారణ - Siromundanam case
గ్రామంలో అడుగుపెడితే చంపేస్తామంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులు తాళలేక బయటి గ్రామాల్లో బాధిత కుటుంబాలు తల దాచుకుంటున్నాయని వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో పిటిషనర్స్ తరుఫు లాయర్లు బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. పిటిషనర్స్ తరఫు న్యాయవాదులు నర్రా శ్రీనివాస్, ముప్పాల బాలకృష్ణ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని, గ్రామంలో ప్రశాంత జీవనం కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, డీజీపీ, ఎస్పీ, ఇతరులు ఉన్నారు.