HC on Promotion of Non Teaching Staff as Principals : ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల పదోన్నతుల విషయంలో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాన్ టీచింగ్ సిబ్బంది లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. విద్యా వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి చర్య ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని, ఇలాంటి జీవోలను పౌరసమాజం హర్షించదని తేల్చి చెప్పింది.
అసమర్థులను విద్యా సంస్థలకు అధిపతులుగా నియమిస్తే వాటి తలరాత ఏమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలను అనుమతిస్తే విద్యావ్యవస్థ విధ్వంసానికి దారి తీస్తుందని, అసలు ఈ ప్రభుత్వం ఏమి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు ఏ విధంగా విద్యార్థులకు పాఠాలు చెబుతారని ప్రశ్నించింది. బోధనేతర సిబ్బందిని కళాశాల ప్రిన్సిపాళ్లుగా నియమిస్తే సిలబస్ గురించి వారికి ఏం అవగాహన ఉంటుందని నిలదీసింది.
ఏ లెక్చరర్ ఏ సబ్జెక్టు చెబుతున్నారో వారికెలా తెలుస్తుందని ప్రశ్నించింది. 2021 డిసెంబర్ 8న జీవో 76 జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శిని జైలుకు పంపాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. విద్యా వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా మరే ఇతర కారణాలతో జీవో ఇచ్చినట్లు కనిపిస్తోందని తెలిపింది. ఈ జీవో విద్యా వ్యవస్థ ప్రమాణాలను దెబ్బ తీసేదిగా ఉందని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఏప్రిల్ 1న కోర్టుముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
2018 గ్రూప్-1 రద్దుపై హైకోర్టు స్టే - HC Stay on Group 1 Cancellation
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్స్ పదోన్నతిపై సింగిల్ జడ్జి ఉత్తర్వులను ధర్మాసనం సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.నరేందర్, జస్టిస్ ఎన్ హరినాథ్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. కోడ్ అమల్లోకి రావడానికి ముందురోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 197 మంది లెక్చరర్లకు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్ విద్య కమిషనర్ ఈనెల 15న ప్రొసీడింగ్స్ జారీ చేశారు.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ లైబ్రరీ సైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. సంజీవరావు, మరికొందరు సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యం వేశారు. ప్రిన్సిపల్ పోస్టుల పదోన్నతిలో జూనియర్ లెక్చరర్లు చేసిన వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం 2021లో ప్రభుత్వం జారీచేసిన జీవో 76కి విరుద్ధమన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్ విద్య కమిషనర్ ఈనెల 15న ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్ చేశారు.
సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె. శ్యామ్‌కుమార్ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. తాజాగా జరిగిన విచారణలో నాన్ టీచింగ్ స్టాప్‌కు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పించే వ్యవహారం, అందుకు సంబంధించిన జీవో 76పై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. నాన్ టీజింగ్ సిబ్బందిని ఏ విధంగా చూసినా టీచర్లుగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది.
ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లకు కళాశాల ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పించేందుకు వీలు కల్పిస్తూ జీవో 76ని ఇప్పటి వరకు ఎందుకు సవాలు చేయలేదని అప్పీలుదారు తరఫు సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తిని ప్రశ్నించింది. ఎవరిని పడితే వారిని కళాశాల ప్రిన్సిపల్‌గా నియమిస్తే విద్యావ్యవస్థకు నష్టం జరగదా? అని వ్యాఖ్యానించింది. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలను గురించి పట్టించుకోరా అని ప్రభుత్వ న్యాయవాదిని నిలదీసింది.
నైపుణ్యంలేని వారు ఇంగ్లీష్‌లో ఎలా బోధిస్తారు?- జగన్ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం