Harassment of Superiors in Kurnool Nature Agriculture Department : ప్రకృతి వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఏర్పాటైన రైతు సాధికార సంస్థను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కర్నూలు ప్రకృతి వ్యవసాయ విభాగంలో పాగా వేసిన కొందరు అధికారులు కింది స్థాయి సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తున్నారు. తమను ప్రశ్నించిన వారిని, గిట్టని వారిని, వేధించటం, దూషించటం, ఫీల్డ్ విజిట్ల పేరుతో తొలగించటం చేసేవారు. ప్రభుత్వం మారినా అధికారుల తీరులో మాత్రం ఏ మార్పు రాలేదు. ఇప్పటికీ క్షేత్రస్థాయి సిబ్బందిపై అదే అజమాయిషీ చేస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయ విభాగానికి సంబంధించి కల్లూరు మండలంలోని నాలుగు గ్రామాలకు యూనిట్ ఇన్‌ఛార్జిగా పని చేస్తున్న చంద్రరేఖ ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రకృతి వ్యవసాయ విభాగం డీపీఎం చంద్రశేఖర్, సందీప్, లక్ష్మణయ్య, డి. ఫరీదా, మాస్టర్ ట్రైనర్ ఆంజనేయులు తదితరులు తనను మానసికంగా వేధిస్తున్నారంటూ సూసైడ్ నోట్ రాసి ఇటీవల పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాను ఎల్-1గా విధులు నిర్వహిస్తుండగా తనపై కక్ష కట్టి ఎల్-3గా రివర్షన్ ఇచ్చారని ఎల్-1 నుంచి ఎల్-2గా రివర్షన్ ఇవ్వాల్సి ఉండగా ఉద్దేశపూర్వకంగానే ఎల్-3కి రివర్షన్ చేశారని, మరో 25 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని ఆమె తెలిపారు. మాస్టర్ ట్రైనర్ ఆంజనేయులు ఎలాంటి విధులు నిర్వహించడం లేదని ఆరోపించారు. తాను చనిపోతే అది తన మెడకు చుట్టుకోకూడదన్న ఉద్దేశంతో డీపీఎం ముందు జాగ్రత్త చర్యగా తన మానసిక పరిస్థితి సరిగా లేదని, విధులు సక్రమంగా నిర్వహించడం లేదంటూ ప్రకృతి వ్యవసాయ విభాగంలో పని చేస్తున్న 30 మంది చేత సంతకాలు చేయించుకుని రైతు సాధికార సంస్థకు లేఖను పంపారని వాపోయారు.
'నా ప్రతిభను గుర్తించి కలెక్టర్ సైతం ఉత్తమ ఉద్యోగి అవార్డు కూడా ఇచ్చారు. కానీ 18 నెలల నుంచి జీతం రావటం లేదు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ను అడిగిన పాపానికి కక్ష పెంచుకుని, సరిగా పనిచేయట్లేదంటూ పక్కన పెట్టి డిమోషన్ ఇచ్చారు. అధికారులు నన్ను మానసికంగా వేధిస్తున్నారు. తట్టుకోలేక ఈనెల 9వ తేదీన పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాను. మా కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాలు దక్కాయి. ఇంత జరిగినా నన్ను ఎవరూ పరామర్శించకపోగా, నాపైనే లేనిపోని నిందలు వేశారు.' -చంద్రరేఖ, ప్రకృతి వ్యవసాయం కార్యకర్త
'16 నెలలుగా జీతాల్లేవు ఎలా బతికేది' - వ్యవసాయ ఉద్యోగులు ధర్నా - Employees Protest For Salaries
స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రైతు దినోత్సవం, ధరిత్రీ దినోత్సవం కార్యక్రమాలకు క్షేత్రస్థాయి కార్యకర్తలే స్టాల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటికి 2 వేల రూపాయల వరకు ఖర్చు అవుతోంది. ఈ మొత్తాన్ని కార్యకర్తలే భరించాల్సి వస్తోంది. ఫీల్డ్ కు వెళ్లేందుకు టీఏ, ఖర్చులకు డీఏ ఇవ్వాలి. కానీ ఒక్క రూపాయి కూడా అధికారులు చెల్లించటం లేదు. అనారోగ్యానికి గురైనా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని సిబ్బంది అంటున్నారు. జీతం ఇప్పించమని వేడుకున్నా, వేధిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. అధికారుల వేధింపుల నుంచి కాపాడి ప్రకృతి వ్యవసాయం విభాగాన్ని ప్రక్షాళన చేయాలని క్షేత్రస్థాయి సిబ్బంది కోరుతున్నారు.