Handloom Workers Face Losses With Heavy Rain Effect in Krishna Distict : కృష్ణా జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు అన్నదాతలతో పాటు చేనేత కార్మికులనూ కొలుకోలేదేని దెబ్బ తీశాయి. మగ్గాల్లో ఉన్న చీరలు వర్షపు నీటితో తడిసి కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు 30 రోజుల పాటు ఉపాధికీ దూరమయ్యారు. ఒక్కొక్క మగ్గానికి 25 వేల వరకు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. మగ్గాల్లోకి దాదాపు 3 అడుగుల మేర నీరు చేరడంతో కార్మికులకు ఉపాధి కరవైంది.
కృష్ణా జిల్లాలో చేనేత రంగాన్ని నమ్ముకుని సుమారు 15 వేల మంది కార్మికులు జీవిస్తున్నారు. ఒక్క పెడన నియోజకవర్గంలోనే 5 వేల మంది నేతన్నలు ఉంటారు. వర్షాలు తమను నట్టేటముంచాయని, 30 రోజుల నుంచి మగ్గాల్లో నీరు ఉండటం వల్ల ఉపాధికి దూరమయ్యామని వాపోతున్నారు. మగ్గాల్లో ఉన్న నీటిని తోడుతుంటే మళ్లీ నీరు ఊరుతోందని చెబుతున్నారు. మగ్గంలో ఉన్న చీర తడిసి పోగులు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
'30 రోజుల్లో కనీసం 2 లేదా 3 సాకలు నేసేవాళ్లం. ఒక్కొక్క సాకకు 6 వేల నుంచి 7 వేల వరకు ఆదాయం వచ్చేది. మగ్గాలు నీటమునగడం వల్ల ప్రతి నేత కార్మికుడికి దాదాపు రూ.25 వేల వరకు నష్టం వచ్చింది. మాకు ఈ పని తప్ప మరో పని తెలియదు. గతంలో ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చేనేత సొసైటీల ద్వారా ఆదుకునే వారు. ఇప్పుడు సంఘాలే పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయాయి. ఇక తమ కష్టాలను ఎవరు తీరుస్తారు.' -భవానీ, చేనేత కార్మికురాలు
గత ప్రభుత్వం చేనేత రంగాన్ని గాలికి వదిలేసిందని ఐదేళ్లుగా సొసైటీలకు విడుదల చేయాల్సిన త్రిపుల్ ఫండ్, దారం సబ్సిడీ, 25 పైసల వడ్డీ రుణాలు, పండుగల సమయంలో వస్త్రాలకు ఇచ్చే 30శాతం రాయితీల వంటి వాటినీ విడుదల చేయలేదని కార్మికులు చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిందని సంతోషించే లోపే వర్షాలు కోలుకోలేని దెబ్బ తీశాయని అంటున్నారు.
జగనన్న మొండి చెయ్యి - తెగిన దారం పోగులా నేతన్నల బతుకులు - WEAVERS PROBLEMS