Gulbenkian Prize Winner Nagendramma Nettem: శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన నెట్టెం నాగేంద్రమ్మ అనే మహిళ రైతు ప్రకృతి సేద్యం చేస్తూ మరికొందరు రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నాగేంద్రమ్మ, కౌలుకు పొలం తీసుకుని అందులో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కుమార్తె కంటి చూపు మెరుగుపరచడానికి మొదలుపెట్టిన సహజ సేద్యం, నేడు వందల మందిని సాగు బాట పట్టించేలా చేసింది. ఈ ఛాంపియన్ రైతుని పోర్చుగల్ దేశ గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అవార్డు వరించింది.
ఆమె చేస్తున్న ప్రకృతి వ్యవసాయం గురించి విదేశీ బృందాలు క్షేత్రస్థాయికి వచ్చి తెలుసుకున్నాయి. గ్రామీణ మహిళా రైతు పోర్చుగల్ దేశానికి వెళ్లి పురస్కారం అందుకోవడంతో స్థానికులు ఆమెను అభినందిస్తున్నారు. తాను చేస్తున్న ప్రకృతి వ్యవసాయం గురించి పొలం వద్దకు వచ్చే రైతులకు ఓపికగా సూచనలు ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తనకు లభించడం ఎంతో ఆనందంగా ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయానికి చేయూతనివ్వాలని నాగేంద్రమ్మ కోరుతున్నారు.
ఏపీ సమాఖ్య ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ గుల్బెంకియన్ అవార్డు
APCNF Won Gulbenkian Prize for Humanity: ఆంధ్రపదేశ్ సమాఖ్య ప్రకృతి వ్యవసాయానికి ప్రఖ్యాత గుల్బెంకియన్ అవార్డు దక్కింది. అమెరికాకు చెందిన భారత సంతతి శాస్త్రవేత్త రతన్ లాల్, ఈజిప్టుకు చెందిన సెకెమ్ స్వచ్ఛంద సంస్థతో కలిపి APCNF (Andhra Pradesh Community Managed Natural Farming) ఈ అవార్డు గెలుచుకుంది.
గుల్బెంకియన్ అవార్డు గ్రహీతలకు 1 మిలియన్ యురోల నగదు పురస్కారం లభించనుంది. జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నుంచి రైతు సాధికార సంస్థకు చెందిన ఏపీసీఎన్ఎఫ్ గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అవార్డు అందుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో కొత్త విధానాలు, అమల్లో భాగంగా ఏపీసీఎన్ఎఫ్ ఈ అవార్డుకు ఎంపికైంది. ప్రపంచ వ్యాప్తంగా 181 నామినేషన్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అవార్డు అందుకుంది. ఏపీసీఎన్‌ఎఫ్‌కు అవార్డు రావడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అనుసరించిన జీరో బేస్డ్ నాచురల్ ఫార్మింగ్‌కు అంతర్జాతీయ గుర్తింపు దక్కిందని, అవార్డు సాధించడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. అవార్డు సాధించిన ఏపీసీఎన్‌ఎఫ్, రైతు సాధికార సంస్థకు అభినందనలు తెలిపారు.