Gudlavalleru Engineering College Issue: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల బాలికల వసతి గృహంలోని స్నానాల గదుల్లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ జరిగిన ప్రచారంతో కలకలం రేగింది. మూడు రోజుల కిందట కొంతమంది విద్యార్థినులు ఇదే అనుమానంతో వార్డెన్ పద్మావతికి ఫిర్యాదు చేశారు. ఆమె విద్యార్థినులపైనే కేకలు వేయడంతో వారంతా మౌనంగా ఉన్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థుల్లో ప్రచారం జరిగి సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.
గురువారం కొందరు విద్యార్థులు కళాశాల పర్యవేక్షణాధికారికి ఫిర్యాదు చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థి అదే కళాశాలలో మరో విద్యార్థిని ప్రేమలో ఉన్నారని వారి ద్వారా విషయం తెలిసిందని చెప్పారు. దీంతో ఆ పర్యవేక్షణాధికారి వారిద్దరినీ పిలిచి వారి ఫోన్లను పరిశీలించి చిన్న విషయంగా తీసుకుని పంపించి వేశారు. దీనిపై కలత చెందిన విద్యార్థినులు గురువారం రాత్రి పది గంటలకు వసతి గృహం నుంచి బయటకు వచ్చి ఆందోళనకు దిగారు.
విద్యార్థినుల నిరసనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తప్పు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశంతో జిల్లా యంత్రాంగం కదిలింది. మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్లర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధర్ హుటాహుటిన కాలేజీకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మహిళా సీఐ ఆధ్వర్యంలో సాంకేతిక బృందాన్ని విచారణకు నియమించారు. విద్యార్థినుల ఫిర్యాదులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ పద్మావతిపై చర్యలకు ఆదేశించారు. వసతి గృహంలో రహస్య కెమెరాలు లేవని ధ్రువీకరిస్తేనే తాము లోపలికి వెళ్తామని విద్యార్థినులు బయటే ఉండిపోయారు. దీంతో బాంబ్ స్వ్కాడ్, ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించే పరికరాలతో పోలీసులు సోదాలు చేశారు.
ఆరోపణలు వచ్చిన ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరో విద్యార్థినిని యాజమాన్యం అదుపులో ఉంచారు. వారి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇస్తుందని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. కళాశాలలో ఇలాంటి ఘటన అత్యంత బాధాకరమని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నట్లు చెప్పారు.
ఆందోళనల దృష్ట్యా విద్యార్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడవద్దని యాజమాన్యానికి ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. హల్ టికెట్లు ఇవ్వకపోవడం, సర్టిఫికెట్ల జారీ నిలిపివేయడం లాంటివి చేయొద్దని సూచిస్తూ కళాశాల యాజమాన్యంతో సర్క్యులర్ జారీ చేయించారు. మూడు రోజులపాటు కళాశాలకు యాజమాన్యం సెలవులు ప్రకటించింది. కళాశాలలోకి వెళ్లేందుకు యత్నించిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు మెయిన్ గేట్ వద్ద అడ్డుకున్నారు. ప్రభుత్వం విచారణ చేపట్టినా వైఎస్సార్సీపీ నేతలు రాజకీయం చేస్తున్నారంటూ కళాశాల విద్యార్థినులు మండిపడ్డారు.
గుడ్లవల్లేరు రహస్య కెమెరాల ఘటన - దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశం - Hidden Cameras in Girls Hostel