Gudivada Constituency Former MLA Kodali Nani Cheated People : వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో కుతంత్రాలు, కక్ష రాజకీయాలకు రాష్ట్రం బలైంది. గుడివాడ నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వాకంతో చాలా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. కేవలం తెలుగుదేశం గెలుపును అడ్డుకోవాలని కుట్రతో తెచ్చిన వార్డుల విలీనం ఎన్నో ఊళ్లలో అభివృద్ధిని అటకెక్కించింది. ప్రస్తుత కూటమి సర్కారు నిలిచిన అభివృద్ధి పనులను మళ్లీ పట్టాలెక్కించడంపై హర్షం వ్యక్తమవుతోంది.
ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వైఎస్సార్సీపీ నేతలు గత ఐదేళ్లు సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రదర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ బలంగా ఉన్న పంచాయతీల్లో గెలుపు కోసం దాదాపు 15 వేల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. గుడ్లవల్లేరు, కోరాడ, కౌతవరం పంచాయతీల్లో టీడీపీ గెలుపును అడ్డుకోవాలని వార్డుల విలీనాన్ని తెరపైకి తెచ్చారు. కొడాలి నాని ఆడిన ఆటకు గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయింది.
గుడ్లవల్లేరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు 2021లో ఎన్నికలు జరిపితే గుడ్లవల్లేరు, కోరాడ, కౌతవరం గ్రామాల్లో మాత్రం ఎన్నికలు నిలిపివేశారు. కారణం కౌతవరంలోని 1,2, వార్డులను, కోరాడలోని 7,8,9 వార్డులను గుడ్లవల్లేరులో విలీనం చేయాలనే సాకు చూపి ఆయా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిలిపివేయించారు. దీని వల్ల పాలక వర్గం లేక గ్రామాల్లో ప్రగతి పడకేసింది.
కోల్పోవడం ఖాయమని కుట్ర : పంచాయతీల్లో ఎన్నికలు జరగకుండా విలీనాన్ని నిలిపివేయాలని కొడాలి నాని చూశారు. తన మనుషుల ద్వారా ఆయనే కోర్టుకు వెళ్లారు. పైగా విలీనం ఆలస్యమవుతుందంటూ ప్రజలను నమ్మించారు. వాస్తవంగా ఈ మూడు గ్రామాల్లో టీడీపీ బలంగా ఉండటంతో ఎన్నికలకు వెళితే మూడు పంచాయతీలను వైఎస్సార్సీపీ కోల్పోవడం ఖాయమని కుట్ర చేశారు. తాను మంత్రిగా ఉండి మూడు పంచాయతీలు కోల్పోతే పరువు పోతుందనే ఆలోచనతో ఆనాడు సమస్యను సృష్టించారు. పంచాయతీలకు ఎన్నికలు లేకపోవడంతో 15 ఆర్థిక సంఘం నిధులు రాక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఊళ్లలో చిన్న పాటి సమస్యలను సైతం పరిష్కరించుకొనే అవకాశం లేకుండా పోయింది. మూడు పంచాయతీల్లోని 15 వేల మంది సమస్యలతో సహవాసం చేశారు.
వైసీపీ కబ్జా కోరల్లో ఉన్న గుడివాడ కళాక్షేత్ర భవనానికి త్వరలో విముక్తి - Kalakshetram Occupy
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆయా గ్రామాల్లో నిలిచిన అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. రోడ్లు, కాలువలు, పారిశుద్ధ్యం పనులను చకచకా చేస్తోంది. పాలక వర్గం లేకపోయినా ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతోంది. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.