Govt Talks with APNGOs and Pensioners Association Leaders: విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చే పింఛన్లో ప్రభుత్వం విధించిన కోతను ఎత్తి వేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లు చేస్తోన్న ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎన్జీవో, ఏపీ పెన్షనర్ల సంఘం ప్రకటించింది. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో కొనసాగిన చర్చలు ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ జవహర్ రెడ్డి,సజ్జల, ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఈ క్రమంలో డిమాండ్ల పరిష్కారానికి సమయం ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తితో ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లు పెన్షనర్ల సంఘం నేతలు ప్రకటించారు.
ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి - లేకపోతే వచ్చే నెలలో కార్యాచరణ ప్రకటిస్తాం: బండి శ్రీనివాసరావు
సానుకూల నిర్ణయం రాకపోతే తిరిగి ఉద్యమ బాట: ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తగ్గించిన పింఛన్ మొత్తాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ ఈ నెల 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు నివ్వడంతో ప్రభుత్వం చర్చలు జరిపినట్లు నేతలు తెలిపారు. అడిషనల్ క్వాంటం పెన్షన్ మొత్తం పెంపు సహా పెన్షనర్లకు డీఏ బకాయిలు, పీఆర్సీ ఏరియర్స్, ఈహెచ్ఎస్ కార్డులూ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించి పరిశీలించనున్నట్లు ప్రభుత్వం తెలిపిందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మా సమస్యలను పరిష్కరిస్తామన్నారని తెలిపారు. 5న విజయవాడలో తలపెట్టిన జరపాల్సిన ధర్నా సహా ఆందోళనలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే తిరిగి ఉద్యమం చేపడతామన్నారు.
10 నుంచి 7 శాతానికి తగ్గింపు: పక్కరాష్ట్రంలో పింఛన్ దారులకు 15 శాతం అడిషనల్ క్వాంటం ఇస్తుంటే ఇక్కడ 10 నుంచి 7 శాతానికి తగ్గించారని నేతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సమయం కావాలని మమ్మల్ని కోరినందున , తాత్కాలికంగా ఉద్యమాన్ని వాయుదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు, డీఎ సహా ఇతర బకాయిలు ఇవ్వాలనీ కోరినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఐఆర్ కావాలని సీఎస్‌ను, ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరామని, ఎన్నికల ముందు ప్రభుత్వాలు ఐఆర్ ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోందన్న బండి శ్రీనివాస్, ఐర్పై ప్రభుత్వం అనుకూలంగా స్పందిస్తుందని ఆశాభావంతో ఉన్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు అడిషనల్ క్వాటం పించన్ ను 10 నుంచి 7 శాతానికి తగ్గించింది. ప్రభుత్వ నిర్ణయంతో పెన్షనర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఈనెల 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు నివ్వడంతో ప్రభుత్వం చర్చలు జరిపింది. సీఎస్, సలహాదారులు సజ్జల , చంద్రశేఖరరెడ్డి చర్చలు జరిపారు. అడిషనల్ క్వాంటం పెన్షన్ మొత్తం పెంపుపై చర్చించారు. మా డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించి పరిశీలించనున్నట్లు తెలిపారు.- బి వెంకటేశ్వర్లు, ఎపీ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
డిమాండ్ల సాధన కోసం పెన్షనర్లు రెండు వారాలుగా ధర్నాలు చేస్తున్నారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సమయం కావాలని మమ్మల్ని కోరింది. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా తాత్కాలికంగా ఉద్యమాన్ని వాయుదా వేయాలని కోరారు. ప్రభుత్వ కోరిక మేరకు మా ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నాం. ఐర్పై ప్రభుత్వం అనుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.- బండి శ్రీనివాస్, ఎపీఎన్జీవో అధ్యక్షుడు