Government Released List of 100 Anna Canteens : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుంచి తొలివిడతలో ప్రారంభించనున్న 100 అన్నా క్యాంటీన్ల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. తొలి విడతలో 17 జిల్లాల్లో 100 అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఆగస్టు 15 తేదీన మధ్యాహ్నం 1 గంటకు గుడివాడలో అన్నా క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు 16వ తేదీన అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.
చంద్రబాబు పర్యటన ఖరారు : పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్‌లను ఈ నెల 15న ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవాన తొలి విడతగా 100 క్యాంటీన్‌లు అందుబాటులోకి రానున్నాయి. పంద్రాగస్టున కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను సీఎం ప్రారంభించనున్నారు. మిగతా జిల్లాల్లో ఎంపిక చేసిన 33 పురపాలక, నగరపాలక సంస్థల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర ప్రజలకు శుభవార్త- అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్
అప్పటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి : ఇప్పటికే గుడివాడలో సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఎన్ఆర్ కళాశాల, ఎన్టీఆర్ స్టేడియంలో హెలిప్యాడ్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినందున ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ప్రస్తుతం ఎక్కడెక్కడ, ఎన్నెన్ని ఏర్పాటు చేయాలన్న విషయంలో పురపాలకశాఖ మంత్రి నారాయణ అధికారులతో చర్చించారు. 16వ తేదీ నుంచి ఈ క్యాంటీన్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి.
ఆహార పంపిణీ కాంట్రాక్టు అక్షయపాత్రకే : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని అక్షయపాత్ర వంటశాలను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్న క్యాంటీన్‌లకు ఆహార పంపిణీ ఏర్పాట్లను పరిశీలించినట్టు చెప్పారు. ‘‘గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 180 అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేసి రూ.5కే 4.60 కోట్ల భోజనాలు అందించాం. పరిశుభ్రమైన వాతావరణంలో మంచి భోజనం పేదలకు పెట్టాం. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అన్న క్యాంటీన్‌లను మూసివేసింది. కూటమి ప్రభుత్వం రాగానే క్యాంటీన్‌లు తెరవాలని నిర్ణయించాం. అన్న క్యాంటీన్‌లకు ఆహార పంపిణీ కాంట్రాక్టు అక్షయపాత్ర దక్కించుకుంది. ఈనెల 15న గుడివాడలో అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. పట్టణ ప్రాంతాల్లో 180, గ్రామీణ ప్రాంతాల్లో 200కు పైగా క్యాంటీన్‌లు ప్రారంభించాలనేది ప్రణాళిక. పేద వర్గాలు ఎక్కువగా తిరిగే మార్కెట్‌లు, ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేస్తాం. అక్షయపాత్ర వంటశాల చాలా ఆధునికంగా, పరిశుభ్రంగా ఉంది’’ అని మంత్రి తెలిపారు.
తొలి విడతలో ప్రారంభించనున్న 100 అన్న క్యాంటీన్‌ల జాబితా..