Govt Focus on Mogili Ghat Road: నిత్యం రోడ్డు ప్రమాదాలతో రక్తమోడుతున్న చిత్తూరు జిల్లాలోని మొగిలిఘాట్‌కు మోక్షం వచ్చింది. ఈ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యల కోసం నూతన కార్యక్రమాలు అమలు చేయనుంది. ఇందుకోసం టెండర్లను సైతం దాదాపు ఖరారు చేసింది. జనవరి మొదటి వారం నుంచి క్రాంట్రాక్టర్లు పనులు చేపట్టనున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబరు నెలలో మొగిలిఘాట్ వద్ద కంటైనర్ బస్సును ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడగా, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో వరుస ప్రమాదాలు మొదలయ్యాయి. రెండు నెలల వ్యవధిలో ఇదే ఘాట్‌లో సుమారు 20 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాంతో జాతీయ రహదారుల శాఖ అధికారులు ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టేందుకు వివిధ పనుల కోసం టెండర్లు పిలిచారు. సోమవారం టెండర్లు దాదాపు ఫైనలైజ్ అయ్యాయి. దీంతో పనులు చేపట్టేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేస్తున్నారు.
చేపట్టబోయే నూతన చర్యలు ఇవే:
- సోలార్ లైటింగ్, త్రీబీమ్, డబ్ల్యూబీమ్ క్రాష్ బ్యారియర్లను ఏర్పాటు చేయనున్నారు.
- మొగిలిఘాట్‌లో 2.75 కిలో మీటర్ల పొడవునా సోలార్ దీపాలు ఏర్పాటు చేస్తారు.
- రంబుల్ స్ట్రిప్స్, ట్రాన్స్‌వర్స్ బార్ మార్కింగ్, క్యాట్ ఐస్ వంటివి ఏర్పాటు చేయనున్నారు.
నిరంతరం అప్రమత్తం చేసేందుకు: మొగిలి ఘాట్ పొడవునా నిరంతరం డ్రైవర్లను అప్రమత్తం చేసే దిశగా ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్‌లో ఇప్పటికే 4 చోట్ల స్పీడు బ్రేకర్లు, వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేసినా ప్రమాదాలు మాత్రం ఆగటంలేదు. పోలీసు నిఘా కోసం ఒక కంటైనర్ ఏర్పాటు చేయగా, దాన్ని సైతం లారీలు కొట్టేశాయి. దీంతో అందులో ఉండేందుకు పోలీసులు భయపడుతున్నారు.
ప్రస్తుతం పోలీసు కానిస్టేబుళ్లు రోడ్డు పక్కన ఒక చెట్టునీడన ట్రాఫిక్ని గమనిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రమాదాలు నివారించేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పలమనేరు మోటారు వాహన తనిఖీ అధికారి మధుసూదన్ తెలిపారు.
రెప్పపాటులో ఘోర ప్రమాదం - ఛిద్రమైన శరీర భాగాలు - ఏడుగురు మృతి - Road Accident in Chittoor District