Government Decided to Set Up Hostel for Animals in Each District : రైతులకు వ్యవసాయ పనుల్లో పశువులు ఉపయోగకరంగా ఉంటాయి. గ్రామాల్లోని అన్నదాతలు పశువులను పెంచుకుంటారని అందరికీ తెలిసిందే. వాటిని కుటుంబంలో భాగంగానే చూసుకుంటూంటారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, కుక్కలు వంటి పలు పెంపుడు జంతువులను పెంచుకుంటారు. వారు ఏదైనా పని కోసం పొరుగూరికి వెళ్లాల్సి వస్తే వాటిని చూసుకునేందుకు ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతుంటారు.
ఈ క్రమంలో కేవలం పశువులను చూసుకోవడానికి ఎవరో ఒకర్ని నియమించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. అలాంటి సమయాల్లో పశువులకు మేత, నీరు వంటి తదితర సదుపాయాల గురించి వారు ఆందోళన చెందుతారు. అయితే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ప్రభుత్వం పశువుల కోసం ప్రత్యేకంగా వసతి గృహాలను ఏర్పాటు చేయనుంది.
జిల్లాకో పశువుల వసతి గృహం (హాస్టల్) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పశుసంరక్షణ, వాటి పోషణకు వీలుగా వీటిని ప్రారంభించనుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధుల్లో ఒక్కో వసతి గృహం ఏర్పాటుకు రూ.50 లక్షలు చొప్పున ఖర్చు చేయనుంది. జిల్లాలోని ఏ మండలంలో వసతి గృహం ఏర్పాటు చేయాలో పరిశీలించి పశుసంవర్ధకశాఖ అధికారులు ప్రతిపాదించనున్నారు. రైతులు అత్యవసర సమయాల్లో గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు పశువులను వసతి గృహాలకు అప్పగిస్తే నిర్వాహకులు వాటి పోషణ బాధ్యత తీసుకుంటారు.
పమేరియన్ పరుగులు, షెపర్డ్ సోకులు -ఈ డాగ్స్ని చూస్తే వామ్మో కాదు వావ్ అనాల్సిందే
ఇందుకోసం స్వల్పంగా రుసుము వసూలు చేస్తారు. అదే విధంగా సరైన సంరక్షణ లేక వీధుల్లో తిరుగుతూ రోడ్డు ప్రమాదాలకు గురయ్యే పశువులను నిర్వాహకులు వసతి గృహాలకు తీసుకెళ్లి వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటారు. వీటి ద్వారా వచ్చే పేడతో ఎరువులు వంటివి తయారు చేస్తారు. పశువులను విక్రయించేందుకు రైతులు దూర ప్రాంతాల్లోని సంతలకు వెళ్లే అవసరం లేకుండా వసతి గృహాల్లోనే క్రయ విక్రయాలకు అవకాశం కల్పించనున్నారు. దీనివల్ల వారికి రవాణా ఖర్చులు తగ్గడంతోపాటు మధ్యవర్తుల బెడద తప్పనుందని అధికారులు చెబుతున్నారు.