Gadwal BRS MLA Bandla Krishna Mohan Reddy To Join Congress: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. వారిని అడ్డుకునేందుకు అధిష్ఠానం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండటం లేదు. స్థానిక పరిస్థితులు, నేతల మధ్య ఉన్న వైరం, అభివృద్ధి కోసం నిధులు తదితర కారణాలతో నేతలు కారు దిగి హస్తం గూటికి చేరుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా, వారి దారిలోనే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వెళ్లనున్నట్లు సమాచారం.
పార్టీ మార్పుపై స్పందించిన ఎమ్మెల్యే: గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు, స్థానికంగా గద్వాల జడ్పీ ఛైర్‌పర్సన్ సరితకు మధ్య విబేధాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరిత కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో కృష్ణమోహన్‌రెడ్డి చేతిలోనే ఓడిపోయారు. ఈ గురువారంతో జడ్పీ ఛైర్‌పర్సన్‌గా సరిత పదవీకాలం ముగియనుంది. దీంతో ఎమ్మెల్యే పార్టీ మారడం దాదాపుగా ఖాయమైందని, వారం రోజుల్లో ఎప్పుడైనా బీఆర్ఎస్ను వీడతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కొనసాగుతుంది. ఇదే విషయమై ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని ‘ఈటీవీ భారత్ ’ సంప్రదించగా, పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. కార్యకర్తల అభిప్రాయం తీసుకుని చేరికపై నిర్ణయం తీసుకుంటానని కృష్ణమోహన్‌రెడ్డి వివరించారు.
పార్టీ పిరాయింపులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్: ఇప్పటికే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్లో ఆందోళన నెలకొంది. వారిని అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో పిటిషన్లు వేసింది. పార్టీ మారిన నేతలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌ను కొనసాగిస్తుంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగానే ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ - Congress Focus on Merger of BRSLP