AP Free Gas Cylinder Scheme : ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పౌరసరఫరాల శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో 1.55 కోట్ల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్లకార్డు ప్రాతిపదికగా తీసుకుంటే వీటిలో 35 శాతానికి పైగా అంటే 1.47 కోట్ల కుటుంబాలు అర్హత సాధిస్తాయి. వీరందరికీ సంవత్సరానికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వడానికి సుమారు 3,640 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.
సీఎం ఆమోదించాకే : దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు తీసుకున్న 75 లక్షల మందికే పథకం అమలు చేస్తే ఏడాదికి 1,763 కోట్లు అవసరమవుతోంది. ఏడాదికి ఎంత ఖర్చవుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారనే వివరాలతో పౌరసరఫరాల శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది. దీనిపై మంత్రుల కమిటీ సమావేశమై చర్చించి పలు సిఫారసులు చేసింది. సీఎం ఆమోదించాక విధి విధానాలు వెలువడనున్నాయి.
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి చంద్రబాబు లేఖ : సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా ప్రతి ఇంటికీ సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర విజయవాడలో 825 రూపాయలుగా ఉంది. ఏడాదికి 3 సిలిండర్ల లెక్కన ప్రస్తుతమున్న వంటగ్యాస్ ధర ప్రకారం ఒక్కో కుటుంబానికి 2,478 రూపాయల మేర ప్రయోజనం చేకూరనుంది.
కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల యోజనలాగే రాష్ట్రంలోని పేద కుటుంబాలకు 1999 నుంచే దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, వాటినీ ఉజ్వల కింద పరిగణనలోకి తీసుకుని సిలిండర్‌కు 300 చొప్పున రాయితీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి లేఖ రాశారు. దీనిపై కేంద్రం ఇంకా ఏమీ తేల్చలేదు. దీన్ని ఆమోదిస్తే దీపం, ఇతర పథకాల కింద ఉన్న 65 లక్షల కనెక్షన్లను ఉజ్వల కిందకు మార్చుకోవచ్చు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి 585 కోట్ల భారం తగ్గుతుంది. ఐదేళ్లకు 2,925 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
నివేదికలు సిద్ధం చేస్తున్న అధికారులు : దీపంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద 50 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 2016లో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి ఉజ్వల యోజన (Pradhan Mantri Ujjwala Yojana)ను ప్రారంభించారు. ఈ పథకంలో సుమారు 9.70 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. సామాజిక బాధ్యత కింద ఇంధన కంపెనీలు ఆరు లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాయి మొత్తంగా 75 లక్షల మంది వివిధ పథకాల కింద గ్యాస్ తీసుకుంటున్నారు. 9.70 లక్షల ఉజ్వల వినియోగదారులకు కేంద్రం ఒక్కో సిలిండర్‌పై 300 చొప్పున ఏడాదికి 12 సిలిండర్లకు రాయితీ ఇస్తోంది.
వీరికి ఒక్కో సిలిండర్‌పై 525 చొప్పున రాయితీ ఇవ్వాల్సి ఉంది. మూడు సిలిండర్లకు ఏడాదికి 153 కోట్లు ఖర్చవుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. దీపం, ఇంధన కంపెనీలిచ్చిన 65 లక్షల కనెక్షన్లకు ఒక్కో సిలిండర్‌కు 825 రూపాయల చొప్పున ఏడాదికి ఇచ్చే 3 సిలిండర్లకు 1,610 కోట్లు భారాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంది. మొత్తంగా 1763 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
మూడేళ్లలో 95 లక్షల ఇళ్లకు సురక్షిత నీరు: సీఎం చంద్రబాబు - CM CBN Review on Jaljeevan Mission