Four Years Child Died After Falling From Hotel Window in Vijayawada : తల్లి, తండ్రి, ఇద్దరు చిన్నారుల కుటుంబం తీర్థయాత్రకు వచ్చి అనుకోని ఘటనతో తీరని శోకంలో మునిగిపోయింది. ముద్దు ముద్దు మాటలతో సందడి చేసే కుమార్తె హోటల్ నాలుగో అంతస్తులోని కిటికీ నుంచి జారి పడి మృతి చెందింది. ఈ సంఘటనతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ హృదయవిదారక ఘటన విజయవాడలోని మినర్వా గ్రాండ్ హోటల్‌లో జరిగింది.
విశాఖపట్నం మహారాణి పేటకు చెందిన బద్రి నాగరాజు ఓ కంపెనీలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. అతను భార్య సాయి గీత, కుమారుడు జై అద్విక్ (6), కుమార్తె రూహిక (4)లతో కలిసి ఈ నెల 26న ( అక్టోబర్ 26న) తీర్థయాత్రలకు బయలుదేరారు. శ్రీశైలం, మహానంది దర్శనం చేసుకుని ఆదివారం రాత్రి (అక్టోబర్ 27న) విజయవాడకు చేరుకున్నారు. సోమవారం (అక్టోబర్ 28న) కనకదుర్గమ్మను దర్శించుకున్నాక ఇంటికి వెళ్దామని నిర్ణయించుకుని మినర్వా గ్రాండ్ హోటల్ నాలుగో అంతస్తులో గది తీసుకున్నారు.
నడిరోడ్డుపై మంటగలిసిన మానవత్వం - అందరూ చూస్తుండగానే రక్తపు మడుగులో యువకుడు మృతి
కిటికీకి ఇనుప గ్రిల్ లేకపోవడంతో : సోమవారం ఉదయం సాయి గీత స్నానానికి వెళ్లగా, నాగరాజు పడుకున్నారు. చిన్నారుల ఇద్దరూ దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రూహిక కిటికీ వద్ద కర్టెన్ వెనుక దాక్కొంది. ఆ కిటికీకి ఇనుప గ్రిల్ లేకపోవడంతో ప్రమాదవశాత్తూ అందులోంచి కిందకు జారిపడిపోయింది. ఆ క్రమంలో కిటికీ రెక్క పట్టుకుని 20 సెకన్ల పాటు గాలిలో వేలాడింది పాపం ఆ చిన్నారి. కింద రోడ్డు మీదుగా వెళ్తున్న ఇద్దరు యువకులు ఆ చిన్నారిని గమనించారు. దీంతో వారు పెద్దగా కేకలు వేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించినా అప్పటికే చిన్నారి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది.
విధి ఆడిన వింత నాటకం - ఒకే ఆసుపత్రిలో అటు తండ్రి మరణం - ఇటు పుత్రుడి జననం
కిటికీలోంచి కిందకు చూడగా : చెల్లి కనిపించడం లేదని అద్విక్ తండ్రికి చెప్పగా గది అంతా వెతుకుతూ కిటికీలోంచి కిందకు చూడగా చిన్నారి కనిపించడంతో పరుగున కిందకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన కుమార్తెను పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ హస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ చిన్నారిని వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని తెలియజేశారు. చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లమని వైద్యులు సూచించారు. దీంతో అక్కడకు తీసుకువెళ్లాగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. పిల్లలను తీసుకుని తీర్థయాత్రలకని కారులో బయలుదేరిన ఆ తల్లిదండ్రులు అదే కారులో తమ కుమార్తెను విగతజీవిగా తీసుకుని కొండంత దుఃఖంతో సొంతూరుకు బయలుదేరిన సంఘటన స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. కిటికీకి గ్రిల్స్ అమర్చకుండా గది అద్దెకు ఇచ్చిన హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం ముక్కుపచ్చలారని చిన్నారిని బలి తీసుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.