Former APSBCL MD Vasudeva Reddy Absconded: జగన్ ప్రభుత్వ పెద్దలు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు సూత్రధారులుగా సాగించిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీఎస్‌బీసీఎల్ (Andhra Pradesh State Beverages Corporation Limited) మాజీ ఎండీ, ఐఆర్‌టీఎస్ అధికారి డి. వాసుదేవరెడ్డి నెలన్నర రోజులుగా పరారీలోనే ఉన్నారు.
విజయవాడలోని APSBCL ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు, ఇతర కీలక పత్రాలను చోరీ చేశారన్న ఫిర్యాదుపై, ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర అభియోగాలతో గత నెల 6వ తేదీన వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ తరువాత వాసుదేవరెడ్డి పరారయ్యారు. గత నెల 7వ తేదీన హైదరాబాద్‌లోని వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించిన సమయానికే ఆయన తప్పించుకున్నారు.
అప్పటి నుంచి సీఐడీ స్పెషల్ టీమ్స్ ఆయన కోసం గాలిస్తున్నాయి. విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు వాసుదేవరెడ్డిపై సీఐడీ అధికారులు లుక్ అవుట్ సర్క్యులర్ సైతం జారీ చేశారు. ఓ వైపు అజ్ఞాతంలో ఉంటూనే మరోవైపు తన న్యాయవాదుల ద్వారా వాసుదేవరెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
వైఎస్సార్సీపీ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దలు, వైఎస్సార్సీపీ నాయకులు, వారి సన్నిహితులు కలిసి, మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నీ గుత్తాధిపత్యంలో ఉంచుకొని భారీ ఎత్తున దోచుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతంలో జరిగిన దోపిడీకి సంబంధించిన కీలక ఆధారాలు, పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నాలు చేసినట్లు సీఐడీ గుర్తించింది.
చర్యలు తీసుకోకపోవటం ఆశ్చర్యం: ఏపీఎస్‌బీసీఎల్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డిని ఏప్రిల్ 16వ తేదీన ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసింది. ఎలక్షన్ సమయంలో వైఎస్సార్సీపీకి అనుచిత లబ్ధి కలిగించేలా వ్యవహరించారన్న ఫిర్యాదులపై ఆయనపై బదిలీ వేటు వేసి, సాధారణ పరిపాలన శాఖలో (General Administration Department) రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఉన్నతాధికారుల పర్మిషన్ లేకుండా ఆయన హెడ్‌క్వార్టర్స్‌ను విడిచిపెట్టి వెళ్లకూడదు. అలా వెళ్తే సర్వీసు నియమావళి ప్రకారం వాసుదేవరెడ్డిని సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. నెలన్నర రోజులుగా వాసుదేవరెడ్డి పరారీలోనే ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం ఈపాటికే ఆయనని సస్పెండ్ చేయాలి. కానీ అలాంటి చర్యలు ఏవీ తీసుకోకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది.