Forest Animals Count Increasing in Nizamabad District of Telangana : అటవీ అధికారులు నిజామాబాద్ జిల్లాలో అడవుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. జంతువులకు అడవులు నివాస యోగ్యంగా మారడంతో సంతతి రెట్టింపైంది. అధికారులు అటవీ ప్రాంతాల్లో కాలి నడకన గస్తీ తిరగడం, రాత్రిళ్లు కాపలా ఉండటం, కీలక ప్రాంతాల్లో నిఘా పెట్టడం, దట్టమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల బిగింపు, అవసరమైన నీటి వసతి, ఆహారం అందేలా చర్యలు తీసుకోవడంతో అవి స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. వేటగాళ్ల ముప్పు తప్పడంతో రోజురోజుకు సంతతి వృద్ధి చెందుతోంది. అన్ని అటవీ రేంజ్‌ల పరిధిలో అటవీ జంతువుల సంచారం ఉంది.
జిల్లాలో ఇలా : జిల్లాలో నిజామాబాద్, ఆర్మూర్ అటవీ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 83 వేల హెక్టార్ల అటవీ విస్తరించి ఉంది. నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ నార్త్, ఇందల్‌వాయి, ఆర్మూర్, వర్ని, కమ్మర్‌పల్లి, సిరికొండ రేంజ్‌లుగా విభజించారు. వీటి పరిధిలో అటవీ అధికారులు కాలినడకన తిరుగుతూ అటవీ సరిహద్దులు, జంతువుల సంచారం, వివిధ జాతుల చెట్లను నిత్యం పరిశీలిస్తున్నారు.
వన్యప్రాణులను పట్టుకోవడానికి వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులను తొలగిస్తున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండటంతో కొన్నాళ్లుగా జంతువుల సంచారం పెరిగింది. అవి నివాసం ఉంటున్న ప్రాంతాల్లో నీటి వసతి కల్పిస్తున్నారు. గతంలో తక్కువ సంఖ్యలో ఉన్న జంతువులు సైతం నేడు గణనీయంగా వృద్ధి చెందడం గమనార్హం.
"గుడ్లు పెట్టి వెళ్లిన బట్టమేక పిట్ట - ఆ పక్షి కోసం 9చ.కి.మీ. భూమి వదిలేశారు" - సందర్శకులకు అనుమతి
ప్రత్యేక చర్యలు : వన్యప్రాణులు అడవులను వీడి బయటకు రాకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా శాఖాహార జంతువుల ఆహార అవసరాలకు అనుగుణంగా గడ్డి క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నారు. అడవిలో చెక్‌డ్యాంలు, పర్క్యులేషన్ ట్యాంకులు, సాసర్ పిట్లు ఏర్పాటు చేసి నీటి సౌకర్యం అందుబాటులో ఉండటంతో అవి వ్యవసాయ పొలాలవైపు రావడం తగ్గింది.
అడవుల్లోకి బయటి వ్యక్తులు, వాహనాలు వెళ్లకుండా ఉండేందుకు ట్రెంచ్ కట్‌లు తవ్వించారు. ముఖ్యంగా చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, నెమళ్లు, నీల్‌గాయి, జింకలు, సాంబార్ల సంఖ్య బాగా పెరిగింది. 2018 జంతు గణనతో పోలిస్తే 2022 వరకు రెట్టింపు జనాభా పెరిగింది. జిల్లాలో అతి తక్కువగా ఉండే హైనాలు ఇప్పుడు పదికి చేరాయి. కుందేళ్లు, అడవి పిల్లులు, కొండ గొర్రెలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయవు ఈ గణనలో తేలినట్లు అధికారులు తెలిపారు.
గణన ఇలా
జంతువులు | 2018 | 2022 |
చిరుతలు | 43 | 86 |
నీల్‌గాయి | 15 | 42 |
అడవి పిల్లులు | 15 | 64 |
జింకలు | 125 | 850 |
నెమళ్లు | 3000 | 4800 |
హైనాలు | 4 | 10 |
అడవికుక్కలు | 32 | 69 |
సాంబారు | 32 | 56 |
నక్కలు | 12 | 26 |
అభయారణ్యాలపై కన్ను - ఎర్రచందనంతో పాటు వన్యప్రాణులు స్మగ్లింగ్
![](https://assets.eenadu.net/article_img/NZB-1A_37.jpg)