Foreign Medical Students Concern : విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన రాష్ట్ర విద్యార్ధుల పరిస్థితి అయోమయంగా మారింది. వైద్య విద్యను పూర్తి చేసి ఏడాది పాటు హౌస్ సర్జన్ విధులు నిర్వహించినా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కాకపోవటంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే తమకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతూ డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఏఐఎస్ ఎఫ్ విద్యార్ది సంఘం దీనికి మద్ధతు తెలిపింది.
జాతీయ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలు : కజికిస్థాన్, జార్జియా లాంటి దేశాల్లో రాష్ట్రానికి చెందిన విద్యార్ధులు కొందరు వైద్య విద్యను అభ్యసించారు. కరోనా సమయంలో ఆన్ లైన్లో తరగతులకు హాజరయ్యారు. కరోనా అనంతరం తమ కళాశాలకు వెళ్లి ఆఫ్ లైన్లో ప్రాక్టికల్స్ పరీక్షను సైతం పూర్తి చేశారు. అలాగే దీనికి సంబంధించిన ధృవపత్రాన్ని సంబంధిత వైద్య కళాశాల నుంచి తీసుకున్నారు. అనంతరం విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన విద్యార్ధులు సంబంధిత రాష్ట్రాల్లో ఏడాది పాటు హౌస్ సర్జన్లుగా విధులు నిర్వహించాలని జాతీయ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం ఏడాది పాటు రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో హౌస్ సర్జన్లుగా విధులు నిర్వర్తించారు. అదికూడా ఈయేడాది మే నెలతో పూర్తయింది. దీంతో విద్యార్ధులు పర్మినెంట్ రిజిస్ర్టేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే నెలలు గడిచినా ఏపీఎంసీ(APMC) అధికారులు ధృవపత్రాలు జారీ చేయటం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
వారు మాట దాటేసే థోరణితో మాట్లాడుతున్నారు : ఏపీఎంసీ నూతన కార్యావర్గాన్ని ప్రభుత్వం ఇంకా నియమించలేదని అందుకే ధృవపత్రాల జారీ ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో రెండో ఏడాది కూడా హౌస్ సర్జన్లుగా విధులు నిర్వహించాలని తాజాగా అధికారులు చెప్పటంపై విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 70 మంది విద్యార్ధులు ధృవపత్రాలు రాక రోడ్లపై పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీ విద్య కోసం నీట్ పరీక్ష రాశామని పరీక్షల్లో ర్యాంక్ వస్తే సర్టిఫికెట్ తప్పని సరి అని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎంసీ అధికారులు మాట దాటేసే థోరణితో మాట్లాడుతున్నారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.
"నెలలు గడిచినా ఏపీఎంసీ అధికారులు ధృవపత్రాలు జారీ చేయటం లేదు. ఏపీఎంసీ నూతన కార్యావర్గాన్ని ప్రభుత్వం ఇంకా నియమించలేదని ఒకసారి, ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతుందని మరోసారి సాకులు చెబుతున్నారు. ఇప్పుడు ఆన్ లైన్లో తరగతులకు హాజరైన వాళ్లు రెండో ఏడాది కూడా హౌస్ సర్జన్లుగా విధులు నిర్వహించాలని చెప్పటం విడ్డూరంగా ఉంది. మాతో పాటు విదేశాల్లో చదువుకున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పర్మినెంట్ రిజిస్టేషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సర్టిఫికెట్లు మంజూరు చేయాలి." - బాధిత విద్యార్థులు
Medical Students: కేటగిరీలుగా ఎంబీబీఎస్ సీట్ల విక్రయంపై వైద్య విద్యార్థుల అభ్యంతరం..
ఇండియన్స్‌కు ఆన్లైన్ క్లాసులు చెప్పేందుకు నో! ఉక్రెయిన్ ప్రొఫెసర్ల 'రాజకీయం'!!