Fire Accident in TTD Administrative Building : తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. ప్రమాదంలో టీటీడీ పరిధిలోని స్దానిక ఆలయాలకు సంబంధించిన ఇంజినీరింగ్ దస్త్రాలు దగ్ధమయ్యాయి. మద్యాహ్న భోజన విరామసమయంలో అగ్నిప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిప్రమాద ఘటనపై విభాగంలో ఉన్న ఉద్యోగి నాగార్జున పరిపాలనా భవనంలోని కంట్రోల్‌రూంకు సమాచారమిచ్చారు. కంట్రోల్ రూం సిబ్బంది అగ్నిమాపకశాఖకు ఫిర్యాదు చేయడంతో అగ్నిమాపక విభాగ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మంటలు తక్కువస్థాయిలో ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికి టీటీడీ సిబ్బంది మంటలను అర్పివేశారు.
ప్రమాదవశాత్తూ జరిగిందా? కుట్రకోణమా? : ఇంజనీరింగ్ విభాగ అసిస్టెంట్ ఇంజినీర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా కుట్రకోణం ఉందా? అనే అంశంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అగ్ని ప్రమాదం జరిగిన పరిపాలన భవనం ఇంజనీరింగ్ సెక్షన్ ను టీటీడీ నిఘా, భద్రతా విభాగ ముఖ్య అధికారి (CVSO) శ్రీధర్ పరిశీలించారు. అనంతరం సీవీఎస్‌ఓ మీడియాతో మాట్లాడుతూ, అగ్నిప్రమాదంలో టీటీడీ పరిధిలోని పలు ఆలయాలు, రహదారులకు సంబంధించి దస్త్రాలు తగులపడినట్లు గుర్తించామన్నారు. ప్రమాదంలో దస్త్రాలు తగులపడినా ఈ ఫైలింగ్ ఉండటంతో డేటా అందుబాటులో ఉంటుందంటున్నారు. అగ్ని ప్రమాదం ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు.
మదనపల్లె దస్త్రాల దహనం కేసు.. ఇటీవలే అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన తెలిసిందే. మంటలు వ్యాపించి 22ఏ భూములకు సంబంధించి వివరాలు ఉన్న కంప్యూటర్లు, ఫైల్స్ ఖాళి బూడిద కావడంతో కేసు నమోదు చేశారు. కుట్రకోణంలోనే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు వ్యాపించాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్ మీద చర్యలు తీసుకుని ముగ్గురిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, జింకా వెంకటాచలపతి, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలోనే ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు సంబందించి ధవళేశ్వరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకంది. ఈ ఘటనలో పోలవరం ఎడమ కాలవకు సంబంధించిన నిర్వాసితుల వివరాలతో ఉన్న ఫైల్స్ మంటల్లో కాలిపోయాయనే వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.