File in Garbage at Guntur West Tahsildar Office : రాష్ట్రంలో కీలక విభాగాలకు చెందిన దస్త్రాలను కాల్చి వేయడం, మాయం చేయడం వంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల విజయవాడ, మదనపల్లెలో దస్త్రాల దహనం ఘటనలు మరువక ముందే తాజాగా గుంటూరు పశ్చిమ తహసీల్దార్ ఆఫీసు వద్ద చెత్తలో దస్త్రాలు ప్రత్యక్షమయ్యాయి. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని చెత్తలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దస్త్రాలను పడేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అధికారులు అక్కడికి వచ్చేసరికి చెత్తలోని దస్త్రాలు మాయం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కీలక దశకు మదనపల్లె ఫైళ్లు దహనం కేసు - వైఎస్సార్సీపీ నేతల కీలక పాత్ర - madanapalle fire accident case
అధికారులు, సిబ్బంది ఉదయం 10 గంటల నుంచి కార్యాలయంలోనే ఉన్నామని గుంటూరు వెస్ట్ తహసీల్దార్ ఫణీంద్ర పేర్కొన్నారు. కార్యాలయం నుంచి మాత్రం ఎలాంటి ఫైళ్లు బయటకు వెళ్లలేదని తహసీల్దార్ అన్నారు. ఫైల్ పడి ఉన్న వీడియో తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లే ప్రధాన గేటు ఉన్న సీసీ కెమెరాదని అధికారులు తేల్చారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఇలా ఏదో ఒక ఫైల్ చెత్తలో పడేసి వీడియో తీసి వైరల్ చేశారెమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని కార్యాలయాన్ని పరిశీలించారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో పూర్తి వాస్తవాలు బయటపడతాయని తహసీల్దార్ అన్నారు.