Road Accident in Anantapur District: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద లారీని కారు ఢీకొంది. టైరు పగిలి అదుపు తప్పడంతో కారు, లారీ కిందకు దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. దీంతో కారులో ఉన్నవారు అక్కడికక్కడే మరణించారు. మృతులు అనంతపురం ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన భక్తులుగా గుర్తించారు. తాడిపత్రిలో నగర సంకీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
అతి వేగమే ప్రమాదానికి కారణమా?: శనివారం మధ్యాహ్నం శింగనమల మండలంలోని నాయనపల్లి క్రాస్ రోడ్డు వద్ద అనంతపురం-కడప హైవేపై బస్సును ఓవర్టేక్ చేసే సమయంలో, కారు టైరు పగలడంతో అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు తాడపత్రిలో నగర సంకీర్తనలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
పెళ్లింట విషాదం - రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, మరో నలుగురికి తీవ్రగాయాలు
ప్రమాదానికి కారణాలు దర్యాప్తు చేస్తున్నాం: యాక్సిడెంట్ జరగడంతో అనంతపురం-కడప హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు, వాహనాల రద్దీని క్లియర్ చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ప్రమాదానికి కారణాలు దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారులు తెలియజేశారు. ప్రమాద స్థలంలో కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానికులు, జెేసీబీ వాహనం సహాయంతో బయటకు తీశారు.
మృతుల వివరాలు: మృతులు వెంకటేశ్, లక్ష్మీప్రసన్నరెడ్డి, సంతోష్, సాయిరెడ్డి, శ్రీనివాసులు, బొత్త షన్ముగగా గుర్తించారు. వీరిలో వెంకటేశ్ (20), లక్ష్మీప్రసన్నరెడ్డి (29), సంతోష్ (32) అనంతపురం జిల్లాకు చెందినవారు. సాయిరెడ్డి (14) హైదరాబాద్, శ్రీనివాసులు (34) సత్యసాయి జిల్లా, బొత్త షన్ముగ (21) శ్రీకాకుళం జిల్లా చెందిన వారిగా గుర్తించారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి: అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శింగనమల మండలం, నాయనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇస్కాన్ టెంపుల్ భక్తులు దుర్మరణం చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అదే విధంగా రోడ్డు ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గంజాయి మత్తులో రైల్వే ట్రాక్‌పై ఇద్దరు యువకులు - దూసుకొచ్చిన ట్రెయిన్
మంటలు చెలరేగి సజీవ దహనం: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం సమీపంలోని 71వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనం అయ్యారు. చవట కండ్రిగ క్రాస్ రోడ్డు వద్ద నాయుడుపేట వైపు వెళుతున్న కంటైనర్‌ను ఎదురుగా మరో వాహనం వచ్చి ఢీకొనడంతో మంటలు వచ్చాయి. ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో డ్రైవర్ ఫిరోజ్ (30) సజీవదహనం అయ్యారు. వాహనంలో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.