Farmers Lost Crops: రాష్ట్రంలో కురిసిన వర్షాలకు అనేక జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంట కాలువల పరిస్థితి దారుణంగా ఉంది. కాలువలు బాగు చేయకపోవడంతో కాలువలు గుర్రపు డెక్క, తూటుకాడతో నిండిపోయాయి. భారీగా వర్షాలు కురుస్తుండటం, ఖరీఫ్‌కు పంట కాలానికి ప్రభుత్వం నీరు విడుదల చేస్తున్నప్పటికీ జిల్లాలో చివరి ఎకరాకు సాగు నీరు అందుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పొల్లలోని నాట్లు నీట మునిగాయి. పంట కాలువలు శుభ్రంగా లేకపోవడంతోనే పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాలకు సాగు, తాగు నీరందించే విజయవాడలోని ఏలూరు కాల్వ, బందరు కాల్వ, రైవస్ కాల్వలు మురికి కూపాలుగా మారిపోయాయి. నిర్వహణ సరిగాలేక గుర్రపు డెక్క, తూటుకాడతో కాల్వలు నిండిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌కు ప్రభుత్వం నీరు విడుదల చేస్తున్నప్పటికీ చివరి ఎకరాకు సాగు నీరు అందే పరస్థితి లేదు. కాల్వలలో వ్యర్థాలు పేరుకుపోవటంతో వర్షాలకు పడిన నీరు పొలాల్లోకి రావడంతో రైతులు కలవర పడుతున్నారు. అడపా దడపా గుర్రపు డెక్కపై రసాయనాలు స్ప్రే చేసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.
వరి నాట్లు వేసిన పొలాలు తూటుకాడ అడ్డుకోడంతో ఆదిలోనే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తక్షణం పంట, మురుగు కాల్వలలో ఉన్న తూటుకాడను తొలగించాల్సిన అవసరం నీటిపారుదల అధికారులపై ఉందని రైతులు పేర్కొంటున్నారు. కృష్ణా డెల్టాలో ఎక్కవ శాతం కాల్వలపై ఆదారపడి రైతులు సాగు చేస్తుంటారు. మెట్ట భూముల్లో మాత్రం బోర్ల ద్వారా సాగు జరుగుతుంటుంది. విజయవాడలో కృష్ణా నది నుంచి మూడు కాల్వాల ద్వారా ఉమ్మడి జిల్లా ప్రజలకు సాగు, తాగు నీరు అందుతోంది.
ప్రభుత్వం సాగునీటి సంఘాలను మళ్లీ ఏర్పాటు చేసి వాటి ద్వారా కాల్వల ఆధునీకరణ పనులు చేయిస్తే తప్ప భారీ వర్షాలు, వరదలప్పుడు పంటలను కాపాడుకోలేమని రైతులు అభిప్రాయపడుతున్నారు. వర్షాల నష్టం కంటే కాల్వల ద్వారా జరిగే నష్టమే తమకు అధికంగా ఉందని వాపోతున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వర్షాలు, వరదలపై మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, ఎన్టీఆర్. జిల్లా కలెక్టర్ సృజనతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, కాల్వల్లో నీటిపారుదల లోపించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు.