Farmers Canteens in Agricultural Markets in Kurnool District : దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆకలిని తీర్చేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రైతు క్యాంటీన్లకు మంచి స్పందన వస్తోంది. వ్యవసాయ మార్కెట్‌లోనే తక్కువ ధరకే నాణ్యమైన భోజనం లభిస్తుండటంతో కర్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ మార్కెట్లలో రైతు క్యాంటీన్లు : రైతులు ఎంతో శ్రమకోర్చి పండించిన పంటను విక్రయించేందుకు మార్కెట్‌కు వస్తారు. వచ్చిన రైతులకు తక్కువ ధరలకే నాణ్యమైన భోజనం అందించాలన్న ఉద్దేశంతో 2016 అక్టోబర్ 24న కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. క్యాంటీన్లు నిర్వహించే బాధ్యతను ఇస్కాన్‌కు అప్పగించారు. నాటి నుంచి నేటి వరకు సీజన్లలో క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించటంతో మార్కెట్లు మూతపడ్డాయి. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేయటంతో తిరిగి క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి.
కాసులు కురిపిస్తున్న టమాటా - అప్పులు తీరిపోతాయని అన్నదాతల ఆనందం
2016 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మధ్యాహ్న సమయంలో రైతులకు రూ. 15కే భోజనం అందిస్తున్నాం. ఈ కార్యక్రమం రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఎక్కడ నుంచే వచ్చిన రైతులకు తక్కువ ధరకే భోజనం దొరుకుతుంది. ఇందుకు ప్రజలు, ప్రభుత్వం మాకు సహకారం అందిస్తున్నారు - రఘునందన్ సేవక్ దాస్, ఇస్కాన్ ప్రతినిధి
15 రూపాయలకే నాణ్యమైన భోజనం : హోటళ్లలో భోజనం చేయాలంటే కనీసం వంద రూపాయలు కావాలి. కానీ ఇస్కాన్ అందిస్తున్న భోజనం హోటళ్లకు ధీటుగా ఉంటోంది. ఇందులో అన్నం, పప్పు, రసం, పచ్చడి, వడియాలు, మజ్జిగా ఉంటాయి. పండుగలు సహా ప్రత్యేక రోజుల్లో స్వీట్ అదనం. దీని కోసం రైతు నుంచి 15 రూపాయలు వసూలు చేస్తారు. మార్కెట్ కమిటీ 20 రూపాయలు, మిగిలిన మొత్తం ఇస్కాన్ భరిస్తుంది.
తక్కువ ధరకే నాణ్యమైన భోజనం : ప్రస్తుతం సీజన్ కావటంతో కర్నూలులో 600, ఆదోని, ఎమ్మిగనూరుల్లో వెయ్యి మందికి పైగా భోజనం సిద్ధం చేస్తున్నారు. కర్నూలులో వండిన ఆహారాన్ని మూడు మార్కెట్లకు తరలిస్తున్నారు. పంటలు చేతికి వస్తుండటంతో జిల్లాలోని ప్రధాన మార్కెట్లకు రైతులు తమ ఉత్పత్తులను తీసుకువస్తున్నారు. రైతులు హోటళ్లకు వెళ్లకుండా మార్కెట్లోని క్యాంటీన్లలోనే సబ్సిడీ భోజనం అందిస్తున్నారు. ఆహారం రుచిగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.