Farmers are Worried about Movement of Elephants : పార్వతీపురం మన్యం జిల్లా ఏనుగుల దెబ్బకు రైతులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే పలువురి ప్రాణాలు తీసిన గజరాజులు సోమవారం కొమరాడ మండలం వన్నాంకు చెందిన శివున్నాయుడును పొట్టన పెట్టుకున్నాయి. ఆయన అరటితోటకు వెళ్లి తిరిగొస్తుండగా ఐదు ఏనుగులు దాడి చేశాయి. కాళ్లతో తొక్కేయడంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
భారీగా పంట, ఆస్తి నష్టం : ఒడిశా లఖేరి అభయారణ్యం నుంచి 2001లో తొలిసారిగా 11ఏనుగులు మన్యం జిల్లాలోకి ప్రవేశించాయి. తర్వాత 2013లో తిరిగి ఒడిశా వెళ్లిపోయాయి. మళ్లీ 2018లో ఒడిశా నుంచి సరిహద్దులో ఉన్న మన్యంజిల్లాకు వచ్చిన గజరాజులు ఇక్కడే తిష్ట వేశాయి. ప్రస్తుతం భామిని, సీతంపేట, జియ్యమ్మవలస, కొమరాడ తదితర మండలాల్లో ఇవి సంచరిస్తున్నాయి. నీరు, ఆహారం మన్యం జిల్లాలో పుష్కలంగా లభిస్తుండటంతో పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఏనుగులు తిరిగి అటువైపు వెళ్లడం లేదు. ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల్లో భారీగా పంట, ఆస్తి నష్టమూ సంభవించింది.
'తల్లి'డిల్లిన గుండె- గున్న ఏనుగు మృతదేహం వద్ద వేదన- వీడియో వైరల్! - Mother Elephant Tearful Moment
గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు : ఏనుగుల దాడిలో మనుషులు, మూగ జీవాల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 2019నుంచి 2023 ఫిబ్రవరి 14వరకు ఏనుగుల దాడిలో మన్యం జిల్లాలో 12మంది మృతి చెందారు. తాజాగా కొమరాడ మండలం వన్నాంలో శివున్నాయుడు మృతితో ఆ సంఖ్య 13కి చేరింది. వీరిలో ఒక్క కొమరాడ మండలానికి చెందిన రైతులే ఆరుగురు ఉండటం విచారకరం. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జిల్లా వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఆదిలోనే నిలిచిపోయిన 'ఆపరేషన్ గజ' : గజరాజులు జిల్లాలోకి ప్రవేశించిన నాటి నుంచి అటవీశాఖ అనేక రకాల ప్రతిపాదనలు చేసింది. తొలిసారి చేపట్టిన 'ఆపరేషన్ గజ' ఆదిలోనే నిలిచిపోయింది. మైదాన ప్రాంతాల్లోకి రాకుండా ఉండేందుకు కందకాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకోసం పాలకొండ మండలం గుడివాడ సమీపంలో పనులు ప్రారంభించగా గిరిజనులు వ్యతిరేకించటంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. పార్వతీపురం సమీపం సాలూరు రేంజ్ పరిధి జంతికొండ వద్ద ఏనుగుల జోన్ ఏర్పాటుకు 2018 డిసెంబర్‌లో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదన అటకెక్కింది. 2024లో జోగంపేట వద్ద కరిరాజుల సంరక్షణ ప్రాంతానికి సన్నాహాలు చేసినా కార్యరూపం దాల్చలేదు.
"ఏనుగుల సంరక్షణతోపాటు, వాటి దాడికి గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. అలాగే ఎలిఫెంట్ క్యాంప్‌ను ఏర్పాటు చేయాడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే కుంకీ ఏనుగులను రప్పించడానికి డిఫ్యూటి సీఎం పవన్ కల్యాణ్ చర్యలు ప్రారంభించారు. ఏనుగులు సంచరించే ప్రదేశానికి ప్రజలు వెళ్లొద్దు." - ప్రసూన, అటవీశాఖ అధికారి
ఊరేగింపులో ఏనుగుల బీభత్సం- భక్తుల తోపులాట- అనేక మందికి గాయాలు! - Elephant Fight In Kerala Video
కజిరంగలో 30ఏనుగుల జలకాలాట- వరదల తగ్గుముఖంతో సందడి- వీడియో చూశారా! - Kaziranga Elephants Video