Extra Money Charged on Abhishekam Tickets in Srisailam Temple: శ్రీశైలం మహా క్షేత్రంలో ఆర్జిత సేవలు నిర్వహించుకునేందుకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్జిత అభిషేకం టికెట్లు తీసుకున్న భక్తులు తమ వెంట వచ్చే ఇద్దరికీ అభిషేక అనంతరం టికెట్లు తీసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం అభిషేక అనంతరం టికెట్లు ఆన్లైన్ లో ఇవ్వకుండా భక్తులను అసౌకర్యాలకు గురి చేస్తున్నారు.
అధికారుల కొత్త నిర్ణయాలు: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో దర్శనానికి అదనపు టిక్కెట్ రుసుం వసూలు చేస్తున్నారని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. అభిషేకం టిక్కెట్‌తో పాటు తీసుకోవాల్సిన అదనపు టిక్కెట్ల బుకింగ్ దేవస్థానం సైట్‌లో నిలిపివేశారని తెలిపారు. ఆన్‌లైన్‌లో 500 రూపాయల అదనపు టిక్కెట్ లేకపోవటంతో క్యూలైన్లో వచ్చిన భక్తులు మూడు వందల రూపాయల టిక్కెట్లు రెండు తీసుకోవాలని సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శన క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక దర్శన టికెట్లు తీసుకున్నవారు గంటల తరబడి క్యూలైన్లో వేచిఉన్నారు. వెబ్ సైట్‌లో మార్పులు, కొత్త నిర్ణాయాలతో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధిక ధరలకు టికెట్లు: అభిషేక కర్తలతో పాటు అదనంగా వచ్చే భక్తులకు టికెట్ రేటు పెంచి విక్రయిస్తున్నారు. సాధారణంగా అభిషేకం టికెట్ ధర 1500 రూపాయలు. దంపతులతోపాటు అదనంగా వచ్చే వారికి 500 రూపాయల చొప్పున మరో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆదివారం రాత్రి నుంచి ఈ అదనపు టికెట్‌లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో దేవస్థానం సిబ్బంది భక్తులతో 300 రూపాయల టికెట్లు రెండు కొనుగోలు చేయిస్తున్నారు. ఇలా ఒక్కో కుటుంబం 500 రూపాయలకు బదులు 600 రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. పైగా ఒక్కో భక్తుడు 300 రూపాయల టికెట్లు రెండు తీసుకోవాలని ఆలయ అధికారులు షరతు విధించారు. దీంతో భక్తుల జేబుకు చిల్లు పడుతోంది.
వేసవి సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీశైలంలో అభిషేకం నిర్వహించుకోవడానికి వచ్చిన భక్తులు చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. అభిషేక అనంతరం టికెట్లు లేవంటూ భక్తుల పిల్లలను బయటకి పంపించి వేయడం, అదనంగా టికెట్లు తెచ్చుకుంటేనే మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తామని ఆలయ క్యూలైన్ల సిబ్బంది చెప్పడం వల్ల భక్తులు మనోవేదనకు గురవుతున్నారు. శ్రీశైలం దేవస్థానం అధికారులు ఎప్పటికైనా జోక్యం చేసుకొని వెబ్సైట్లో అవసరమైన అన్ని టికెట్లను అందుబాటులో ఉంచాలని భక్తులు కోరుతున్నారు.