Hyderabad FTL And Buffer Zones Identified by Hydra : హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కూల్చివేతలు చెరువుల ఆక్రమణదారుల్లోనే కాదు సమీపాన ఉండే సామాన్యుల్లోనూ గుబులు పుట్టిస్తున్నాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అనధికారిక నిర్మాణాలను నేలమట్టం చేస్తుండటంతో వారిలో ఆందోళన నెలకొంది. హైడ్రా రాకను స్వాగతిస్తూనే ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై పూటకో మాట ప్రచారం కావడంతో కలవరపడుతున్నారు.
ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కొత్తగా నిర్మించే నివాసాలు, నివాసేతర నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని స్పష్టం చేయడం ఊరట కలిగించింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎఫ్టీఎల్‌లో ఉన్న నిర్మాణాలు కూల్చక తప్పదని, ముందే వదిలేసి వెళ్లిపోవాలని ప్రకటించడం మరోసారి ఆందోళనకరంగా మారింది.
కూల్చివేతలకు హైడ్రా వద్ద ఎలాంటి ఆధారాలున్నాయి : తమ నివాసాల అనుమతులు, హెచ్‌ఎండీఏ లేఔట్ల అప్రూవల్స్ సహా తదితర వివరాలను ఒకటికి రెండుసార్లు తనిఖీలు చేసుకుంటున్నారు. అలాగే ఆయా చెరువులు పరిధిలోని నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులను కలిసి వివరాలు ఆరా తీస్తున్నారు. గతంలో తమ చెరువులపై ప్రభుత్వాలకు అందిన ఫిర్యాదులు, చెరువుల విస్తీర్ణం, అన్యక్రాంతమైన వివరాలను కూడా సేకరించి పెట్టుకుంటున్నారు. అయితే ఈ దశలో హైడ్రా కూల్చివేతలు దిగే ముందు వారి వద్ద ఉన్న ఆధారాలు ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
నీళ్లు ఎక్కడి వరకు వెళ్తాయో : వాస్తవానికి ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవల్. నీటి వనరుల్లోకి నీళ్లు ఎక్కడి వరకు వెళ్తాయో ఆ ప్రాంతం మొత్తాన్ని ఎఫ్టీఎల్‌గా పేర్కొంటారు. చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఆ చెరువు నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి నీటిపారుదల, రెవెన్యూ శాఖలు ఎఫ్టీఎల్‌ను నిర్ధారిస్తాయి. చెరువు సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఎఫ్టీఎల్ ఉంటుంది. అయితే వర్షాకాలంలో వరదలు ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే చెరువులు, కుంటలు నిండుకుండలుగా కనిపిస్తాయి. కానీ వర్షాభావం తక్కువగా ఉండే పరిస్థితుల్లో చాలా నీటి వనరులు బోసిపోయి కనిపిస్తాయి. చాలా వరకు ఖాళీ స్థలం కనిపిస్తుంది. చెట్లు పెరిగి చిత్తడిగా ఉంటుంది.
నీరు లేకుండా ఉన్నా ఆ ప్రాంతం ఎప్పటికైనా ఎఫ్టీఎల్ పరిధిలోకే వస్తుంది. వాటి సమీపంలో కొందరికి పట్టా భూములుంటాయి. నీటి వనరుల పరిరక్షణ చట్టం, బిల్డింగ్ రూల్స్ 2012 ప్రకారం ఎఫ్టీఎల్ పరిధిలోనూ, అందులో ఉన్న పట్టా భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. కేవలం వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించాలి. లేదంటే గ్రీన్ బెల్ట్‌గా వదిలేయాలి.
30 మీటర్ల వరకు నిర్మాణాలు చేపట్టొద్దు : రెండు లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులున్న ప్రాంతాలను వేరే చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. చెరువు అలుగు పొంగి ప్రవహించే మార్గాన్ని బఫర్‌గా భావించాలి. అక్కడ లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తారు. బఫర్ జోన్‌కు 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ పరిధిలో చెరువు సరిహద్దు నుంచి 50 మీటర్లు ఎఫ్టీఎల్‌గా నిర్ధారిస్తారు.
10 హెక్టార్లు అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ సరిహద్దు 30 మీటర్ల వరకు ఉంటుంది. అలాగే 10 హెక్టార్ల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఉన్న సరస్సులు, కుంటల ఎఫ్టీఎల్ సరిహద్దు 9 మీటర్ల వరకు ఉంటుంది. 10 మీటర్ల కన్నా ఎక్కువ వెడల్పు గల వాగు, నాలా, వరద డ్రెయిన్లకు 9 మీటర్లు, 10 మీటర్ల వరకు వెడల్పు గల వరద డ్రెయిన్ సరిహద్దు నుంచి 2 మీటర్లు ఎఫ్టీఎల్‌గా బిల్డింగ్ రూల్స్‌లో పొందుపరిచారు. అయితే వాటిని నిర్ధారించడంలో నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారుల అలసత్వంతో ఆక్రమణదారులకు అవకాశంగా మారింది.
ఎఫ్టీఎల్ భూముల్లో భవన వ్యర్థాలతో చదును చేసి అక్రమ అనుమతులతో పెద్ద ఎత్తున అనధికారిక నిర్మాణాలు చేపట్టడం మొదలుపెట్టారు. అలా కాలక్రమేణా చెరువులు మొత్తం కుంచించుకుపోయి భారీ ఎత్తున కాలనీలు, నివాస సముదాయాలు వెలిసాయి. గ్రేటర్ పరిధిలో చెరువుల్లో 61 శాతం చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకుపోయాయి.
ఇప్పడు హఠాత్తుగా కూల్చివేస్తే ఎలా : కబ్జా కోరల్లో చిక్కికుపోయిన చెరువులను పరిరక్షించడంతో పాటు ఉన్న చెరువులు ఆక్రమణలకు గురికాకుండా హైడ్రా రంగంలోకి దిగింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని ఆక్రమణలపై నిఘా పెట్టి ఒక్కొక్కటిగా కూల్చివేస్తూ ఇప్పటికీ 100 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. అయితే ఇక్కడే స్థానికుల నుంచి సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ , బఫర్ జోన్లలో ఉందనే విషయం తమకు తెలియదని, 30 నుంచి 40 ఏళ్ల నుంచి నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నామని, ఇప్పుడు హఠాత్తుగా ఎఫ్టీఎల్‌లో ఉందని కూల్చివేస్తే ఎలా జీవించాలని ప్రశ్నిస్తున్నారు.
హైడ్రా చర్యలను సమర్థిస్తూనే తప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులు, రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయి పనిచేసిన సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తమ నివాసాలను కూల్చివేస్తే అందుకు కారణమైన అధికారులు ఎక్కడున్నా సరే వారి ఆస్తులను అటాచ్ చేశానైనా సరే నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.
ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలి : మరోవైపు చెరువులు, నాలాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణ సరిగా జరగలేదని, మళ్లీ రీ-సర్వే చేశాకే హైడ్రా కూల్చివేతలు చేయాలని స్థానికుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా కాదని నిబంధనలకు విరుద్ధంగా వ్యహారిస్తే ఎంతో మంది సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలు రోడ్డున పడతాయని, ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని వేడుకుంటున్నారు.
గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుంది : రంగనాథ్ - Ranganath about Hydra