Damaged Roads in AP : గత సర్కార్ రహదారుల నిర్వహణకు నిధులు ఇవ్వని కారణంగా రోడ్ల మధ్యలో పెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. ప్రత్యేకించి వర్షాకాలంలో వీటి పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. రోడ్లపై గోతులు పూడ్చి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆదేశాలపై ఇంజినీర్లు అంచనాలు వేశారు. దాదాపుగా 3,000ల కిలోమీటర్ల పొడవైన 1,548 రహదారుల పనులకు రూ.863 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదించారు.
YSRCP Neglect Rural Roads Repair : నెల్లూరు, విజయనగరం, ఏలూరు, కృష్ణా, చిత్తూరు, కోనసీమ, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో రహదారుల సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక్కో జిల్లాలో 90 నుంచి 120 వరకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని నివేదికలో తెలిపారు. గ్రామీణ రహదారుల అభివృద్ధికి 2014- 2019 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చి వివిధ గ్రాంట్ల కింద ఐదేళ్లలో రూ.2,000ల కోట్లకు పైగా నిధులిచ్చింది.
టీడీపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ రోడ్ల పునర్నిర్మాణం పేరుతో రూ.1,000 కోట్లు, గ్రామీణాభివృద్ధి నిధి కింద మరో రూ.1,000 కోట్ల వరకు విడుదల చేసింది. వీటితో రహదారులకు ఎప్పటి కప్పుడు మరమ్మతులు జరిగేవి. కొత్తగానూ అనేక చోట్ల రోడ్లు నిర్మించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతోనూ గ్రామాల్లో 25,000ల కిలోమీటర్ల అంతర్గత రహదారులను వేశారు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో గ్రాంట్ల కింద పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి రూపాయి కేటాయించలేదు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులను గ్రామాల్లో భవన నిర్మాణాలకే కేటాయించారు. వాటిని కూడా ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయారు.
రాష్ట్రవ్యాప్తంగా 329 రహదారుల మరమ్మతులు : వైఎస్సార్సీపీ సర్కార్ సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు గ్రామీణ రహదారులపై గుంతలు పూడ్చే పనులు హడావుడిగా చేయించి, రూ.258.85 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. అప్పటి ప్రభుత్వ ఆదేశాలతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి రాష్ట్రవ్యాప్తంగా 329 రోడ్ల మరమ్మతులు చేయించినట్లు ఇంజినీర్లు ప్రస్తుత ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. గుత్తేదారులు ముందుకురాక బాపట్ల, పార్వతీపురం మన్యం, గుంటూరు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో రహదారుల పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.
ఆ రోడ్డుపై ప్రయాణం - వారంలో రెండుసార్లు షెడ్‌కు వాహనాలు
కనీస మరమ్మతులూ కరవే!- వైఎస్సార్సీపీ పాలనకు అద్దం పడుతున్న రహదారులు