Engineering Student Suicide on Online Loan Trap : ఆన్‌లైన్ రుణయాప్ మరో నిండు జీవితాన్ని బలితీసుకుంది. ఉన్నత చదువులు చదివి వృద్ధిలోకి వస్తాడనుకున్న కన్నకొడుకు రుణయాప్‌ల ఉచ్చులో చిక్కుకుని బయటపడలేక ప్రాణాలు బలితీసుకున్నాడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విజయవాడ సమీపంలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న వంశీ రుణయాప్ నిర్వాహకుల ఒత్తిడి తట్టుకోలేక కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వృద్ధిలోకి వస్తాడనుకున్న కుమారుడు విగతజీవిగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
చదువులో ఎప్పుడూ ముందుండే విద్యార్థి అనూహ్యంగా ఆన్‌లైన్ రుణయాప్‌ల వలకి చిక్కాడు. మరో రెండు, మూడు నెలల్లో ప్రాంగణ నియామకాల్లో ఎంపికై సాప్ట్‌వేర్ ఉద్యోగంలో చేరాల్సిన యువకుడు అధిక వడ్డీ రుణాలు చెల్లించలేక ఆర్థాంతరంగా ఆత్మహత్య చేసుకుని తనవు చాలించాడు. విజయవాడ గిరిపురానికి చెందిన మురికింటి వంశీ వడ్డేశ్వరంలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సీఈసీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి తాపీ పని చేస్తూ ఇద్దరు కుమారులను కష్టపడి చదివిస్తున్నాడు. చదువులో ఎప్పుడూ ముందుండే పెద్దకుమారుడు వంశీ ఇంజినీరింగ్ కళాశాలలోనూ ఫ్రీ సీటు సాధించాడు.
వంశీ నాలుగేళ్లు కష్టపడి చదివాడు. మరికొన్ని రోజుల్లో ఉద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడతాడనుకున్న సమయంలో రుణయాప్‌ల వలకు చిక్కాడు. తీసుకున్న అప్పు చెల్లించినప్పటికీ అధిక వడ్డీల కోసం యాప్ నిర్వాహకులు ఒత్తిడి చేశారు. అప్పు విషయం ఇంట్లో చెప్పలేక ఈనెల 25న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
నంద్యాల జిల్లాలో ఘోరం- ఆర్థిక సమస్యలతో దంపతుల ఆత్మహత్య
వంశీ చనిపోవడానికి ముందు తండ్రి సెల్‌ఫోన్‌కు 'అమ్మా-నాన్న నన్ను క్షమించండి, ఐయామ్ సారీ' అంటూ మెసేజ్ పెట్టాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమిచ్చి రెండురోజుల పాటు వెతుకులాడారు. నది ఒడ్డున వంశీ బైక్ గుర్తించినా అతని జాడ తెలియలేదు. సోమవారం ఉదయం నదిలో ఓ గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెళ్లి పరిశీలించగా వంశీగా గుర్తించారు. చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు విగతజీవిగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
వంశీ రుణయాప్‌ల ద్వారా ఎంత నగదు తీసుకున్నాడు ఎంత చెల్లించారన్న దానిపై స్పష్టత లేదు. క్రికెట్ బెట్టింగ్ కోసమే ఆన్‌లైన్ రుణం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రుణయాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రుణం తీసుకున్న వ్యక్తి చనిపోయినా కుటుంబ సభ్యులకు యాప్ నిర్వాహకులు ఫోన్లు చేసి వేధిస్తున్నారు. రుణయాప్ వేధింపులతో ఇటీవలే ఎన్టీఆర్ జిల్లాలో ఓ యువకుడు బలయ్యాడు. ఇలాంటి యాప్ నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.