Endowment Lands Controversy in AP : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అన్ని జిల్లాల్లో ఆలయాలు, దేవదాయ సంస్థల వారీగా భూముల వివరాలు సేకరించారు. ఆలయాలన్నింటికీ కలిపి రికార్డుల ప్రకారం మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములున్నట్లు గుర్తించారు. అందులో 87 వేల 167 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు లెక్కించారు. ఆక్రమణల్లోని దేవదాయ శాఖ భూములను స్వాధీనం చేసుకోబోతున్నామంటూ జగన్ ప్రభుత్వం హడావిడి చేసింది తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
గత ప్రభుత్వంలో ఆక్రమణలపై హడావిడే : ఆలయ భూముల్లో కౌలుదారులు, దుకాణాల లైసెన్సుదారులు కాలపరిమితి ముగిసినా ఖాళీ చేయకపోతే, సంబంధిత ఆలయ అధికారులు దేవదాయశాఖ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించేవారు. అయితే ఇలా ట్రైబ్యునల్‌కు వెళ్లకుండా ఆలయ ఈఓ నేరుగా ఆక్రమణదారుకు తాఖీదు ఇచ్చి, చర్యలు తీసుకోవడంతో పాటు బెయిల్‌రాని కేసులు నమోదు చేయించేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చట్టసవరణ చేశారు. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రచారం కల్పించారు. కానీ ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలా లేదు. దీంతో ఆక్రమణదారులు యథావిధిగా ఆ భూములను వినియోగించుకుంటున్నారు.
జగన్ చట్టంతో దేవుడి భూములూ గోవిందా - ఆక్రమిస్తే ఆ పైవాడూ కాపాడలేడు! - NO SAFETY FOR ENDOWMENT LANDS
లీజుల్లో 1.60 లక్షల ఎకరాలు : రాష్ట్రంలోని ఆలయాలు, మఠాలు, సంస్థలు కలిపి మొత్తం 27 వేల 105 ఉన్నాయి. వీటి పరిధిలో 4.67 లక్షల ఎకరాల భూములున్నాయి. వీటిలో మాగాణి 98 వేల 810 ఎకరాలు, మెట్ట 2.95 లక్షల ఎకరాలు, 4 వేల 622 వేల తోటలు, చేపల చెరువులు 4 వేల ఎకరాల వరకు ఉన్నాయి. కొండలు, అడవులు రూపంలో 38 వేల ఎకరాలు, సాగులో లేని ఇతర భూములు 13 వేల ఎకరాలున్నాయి.
అన్ని ఆలయాలు, మఠాలు, సంస్థలకు కలిపి వినియోగంలో ఉన్న భూమి 4 వేల 355 వేల ఎకరాలు. మాగాణి, మెట్ట భూముల్లో కలిపి 1.60 లక్ష ఎకరాలు లీజుకివ్వగా, వీటి ద్వారా ఆలయాలకు ఏటా రూ. 208 కోట్లు రాబడి వస్తోంది. అన్ని ఆలయాలకు కలిపి 2 వేల 563 దుకాణాలు, 1,513 భవనాలు, 1,335 కల్యాణ మండపాలు ఉండగా, వీటితో ఏటా రూ. 51 కోట్లు ఆదాయం వస్తోంది. ఆలయాల్లో సర్వీసుదారుల కింద 1.21 లక్ష ఎకరాల భూమి సాగులో ఉంది. దేవాదాయ శాఖకు సంబంధించి హైకోర్టులో 3800 వరకు కేసులున్నాయి.