Election Commission of India on Former MLA Pinnelli Arrest: ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పించే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందుకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు ఘటన నిదర్శమని తెలిపింది. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనకు సంబందించి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టి వేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం స్పందించింది. రాజ్యాంగ బద్దంగా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఇంక ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయరనీ ఈసి వ్యాఖ్యానించింది.
ఈవీఎం డ్యామేజ్‌కు కారణమైన ఎమ్మెల్యేను అరెస్టు చేయడంతో ఈ ఘటనకు తార్కిక ముగింపు లభించిందని ఈసీఐ స్పష్టం చేసింది. హోదాతో సంబంధం లేకుండా ఎవరూ చట్టానికి అతీతులు కాదన్న విషయం నిరూపితం అయిందని తెలిపింది. ప్రజాస్వామ్యాన్ని బెదిరించే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని అందుకు అనుగుణంగా ఈ అరెస్టు జరిగినట్టు స్పష్టం చేసింది. మే 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రెంటచింతల మండల పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ నెం.202లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే పీ.రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనను భారత ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్- ఎస్పీ కార్యాలయానికి తరలింపు - Pinnelli Ramakrishna Reddy Arrest
శాసనసభలో సిట్టింగ్ సభ్యుడు ఉద్దేశపూర్వకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ధ్వంసం చేయడం నేరపూరిత చర్యగా ప్రజాస్వామ్య ప్రక్రియపై జరిగిన ఘోరమైన దాడిగా కూడా ఈసీఐ పరిగణించింది. వీడియో ఫుటేజ్‌లను పరిశీలించిన తర్వాత, ఎమ్మెల్యేను తక్షణమే అరెస్టు చేయాలని మే 21న ఆదేశించినట్టు ఈసీఐ పేర్కొంది. ఈ క్రమంలో పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదైన ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితులు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషనను దాఖలు చేసినట్టు తెలిపింది. ఏపీ హైకోర్టు ఇవాళ ఆ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఈవీఎంల ధ్వంసానికి పాల్పడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది.