Election Code Will Apply to All Government Advisors: రాష్ట్రంలో కేబినెట్ ర్యాంకులో ఉన్న ప్రభుత్వ సలహాదారులందరికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వ సలహాదారులు తమకు అప్పగించిన బాధ్యతలు మినహా ఇతర రాజకీయ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులైన సలహాదారులకు ఎన్నికల నియమావళి వర్తిస్తుందని వివరించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుంచి జీతభత్యాలు పొందుతున్న 40 మంది ప్రభుత్వ సలహాదారులకు కోడ్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనపై ఎన్నికల కమిషన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందటంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సలహాదారులు ప్రతిపక్ష పార్టీలను రాజకీయంగా విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఈసీ గుర్తించింది. అతడిని సలహాదారు పదవి నుంచి తొలగించాలని సీఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఇది స్పష్టంగా కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంటూ ఈసీ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను కాదని కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ స్పష్టం చేసింది. అధికారిక వాహనం, ప్రోటోకాల్, ప్రభుత్వ సిబ్బంది వంటివి సలహాదారులు వినియోగించుకోకూడదని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాష్ట్రంలోని పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా : ఎంకే మీనా - MUKESH KUMAR MEENA
ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. రాజకీయ ఆరోపణలతో ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించడంతో కోడ్ ఉల్లంఘించారంటూ తూళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వీటన్నింటినీ పరిశీలించిన ఎన్నికల సంఘం ప్రభుత్వంలోని మంత్రులకు వర్తించినట్లే సలహాదారులకు కూడా ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారులకూ ఎన్నికల కోడ్ వర్తిస్తుందని పేర్కొంటూ ఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా ఎస్‌హెచ్‌జీ బృందాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు వద్దని ఆయన ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు. సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది స్వయం సహాయక బృందాలను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. ఓటర్లను రాజకీయంగా ప్రభావితం చేసే ఎలాంటి నిర్ణయాలు వద్దని తేల్చి చెప్పింది.