Special Features of Medak Church : మెదక్‌లోని విఖ్యాత కేథడ్రల్ చర్చి కేవలం పట్టణానికే కాదు ఆసియా ఖండానికే తలమానికం. ఇది మెదక్‌లో నిర్మించిన తొలి చర్చి కాదు. దీనికంటే అనేక ఏళ్ల క్రితమే మరొకటి నిర్మితమైంది. అదే ఛాపెల్ చర్చి. స్థానికులు దీన్ని పాత చర్చిగా పిలుస్తారు. పాత చర్చిని మతబోధకుడు బర్గీస్ దొర దాదాపు 166 ఏళ్ల క్రితం నిర్మించారు ఇది నేటి వైభవానికి ప్రతీకగా నిలిచింది. ఇందుకోసం మట్టి, రాళ్లను మాత్రమే వినియోగించారు.
పైకప్పును మోదుగ ఆకులు, గడ్డితో కప్పారట. నిర్మాణానికి రూ.375 మాత్రమే ఖర్చయింది. సికింద్రాబాద్ తిరుమలగిరి చర్చిలో పనిచేస్తున్న ఛార్లెస్ వాకర్ ఫాస్నెట్ 1897లో మెదక్ చర్చికి ప్రచారకుడిగా బదిలీ అయి వచ్చారు. అనంతరం చర్చిలో ఈయనే కేథడ్రల్ రూపకర్త కావడం విశేషం.
మిషన్ ఆసుపత్రి సేవలు మిన్న : ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలేవీ లేని కాలంలోనే మెదక్ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందాయి. సువార్త సేవలకు ముందే వెస్లియన్ మెథడిస్ట్ మిషనరీ వైద్యం ప్రారంభించింది. 1870-80 మధ్యకాలంలో మెదక్‌లో ‘మిషన్ హాస్పిటల్’ ఏర్పాటైంది. శస్త్రచికిత్సలను ఇంగ్లండు నుంచి వైద్యులొచ్చి చేసేవారు. మందులు కూడా అక్కడి నుంచే దిగుమతయ్యేవి. శస్త్రచికిత్స థియేటర్, ఎక్స్‌రే, ల్యాబ్ ఉండేవి. జనరల్ వార్డుతో పాటు ప్రత్యేక గదుల్లో రోగులకు సేవలు అందేవి. రుసుము నామమాత్రం.
పేదలు, ధనికులు అనే తేడా లేదు. స్థానికంగానే కాకుండా హైదరాబాద్ నుంచీ మెదక్‌కు చికిత్సల కోసం రావడం గమనార్హం. పాపన్నపేట సంస్థానాధీశురాలికి కంటి చికిత్స ఇదే ఆసుపత్రిలో జరిగిందని చెబుతారు. దాదాపు ఇరవై ఆరేళ్ల క్రితం ఆసుపత్రి మూతపడింది. సీఎస్‌ఐ మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మిషన్ ఆసుపత్రిని ప్రస్తుతం పునరుద్ధరించారు. ఇటీవల ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయానికి ఎదురుగా దుకాణ సముదాయంలో 50 పడకల ఆసుపత్రిని మెదక్ డయాసిస్ ఇన్‌ఛార్జి బిషప్ రైట్ రెవరెండ్ రుబెన్ మార్క్ ప్రారంభించారు. ఇంగ్లండులోని షెఫీల్డ్ నగరంలో 1870లో ఫాస్నెట్ జన్మించారు. మెథడిస్ట్ సంఘంలో వాకర్ ఫాస్నెట్ అభిషేకం పొంది పాస్టర్‌గా మత ప్రచారానికి 1895లో మన దేశానికి వచ్చారు. మూడు రోజుల పాటు ప్రయాణించి మెదక్ చేరుకొని స్థానిక మిషన్ కాంపౌండ్‌లో చర్చి పక్కన చిన్న గదిలో నివసించారు. సువార్త సేవలను విస్తరించడంలో భాగంగా 1,200 మందికి పాస్టర్‌లుగా శిక్షణ ఇచ్చారు. 1950లో ఇంగ్లండులో మృతి చెందారు.
గుణదల మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు - ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు