Dussehra Celebrations in AP : రాష్ట్రవ్యాప్తంగా దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో అలంకరించి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దుర్గమ్మ జన్మనక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. పలు దేవాలయాల్లో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు.
అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూల నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మ సరస్వతీ దేవి అలంకరణలో భక్తులను కటాక్షిస్తున్నారు. దుర్గాదేవి జన్మనక్షత్రం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగింది. టికెట్ దర్శనాలన్నీ రద్దు చేసి కేవలం సర్వ దర్శనానికే అనుమతిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలను సమర్పించారు. కుటుంబ సమేతంగా దుర్గ గుడికి చంద్రబాబు విచ్చేశారు. వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో ఆలయ సేవా కమిటీ సభ్యులను ఆయన మర్యాదపూర్వకంగా పలకరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి తలకు స్థానాచార్యులు శివప్రసాదశర్మ పరివేట్టం చుట్టారు. అనంతరం పట్టువస్త్రాలు తలపై పెట్టుకుని దుర్గమ్మ సన్నిధికి వెళ్లారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అమ్మవారిని దర్శించుకున్నారు. కుమార్తె ఆద్యతో కలిసి దుర్గమ్మ చెంతకొచ్చిన పవన్‌కి ఆలయ ఈవో రామారావు, పండితులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న పవన్‌కి పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందించారు. దుర్గమ్మని హోమంత్రి అనిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ దర్శించుకున్నారు. ఎంపీ శివనాథ్ దంపతులు జగన్మాతకు పట్టువస్త్రాలు సమర్పించారు.
చిన్నారులకు అక్షరాభ్యాసం : విజయనగరం SVN నగర్‌లోని జ్ఞాన సరస్వతీ ఆలయంలోని సరస్వతీ దేవి, మహాలక్ష్మీ దేవి, భువనేశ్వరీ దేవి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శారద సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో వందలాది మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విశాఖ బురుజుపేటలోని శ్రీకనక మహాలక్ష్మీ అమ్మవారు విద్యాలక్ష్మీ రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారికి పుష్పయాగం నిర్వహించారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలోని లక్ష్మీనారాయణ వ్రత మండపంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. విశాఖలోని శ్రీ శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి వారు వేద మంత్రాల నడుమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు.
సరస్వతీ దేవి రూపంలో దర్శనం : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో విద్యార్థులు అమ్మవారికి సామూహిక సరస్వతీ పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలోని శ్రీ కోట్ల సత్తెమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి సరస్వతీ దేవి రూపంలో దర్శనమిస్తున్నారు. సుమారు 500 మంది మహిళలు ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు చేశారు. ఉండ్రాజవరం మండలం పాలంగిలోని కనకదుర్గమ్మ ఆలయంలో బాలబాలికలు సామూహిక సరస్వతి పూజలు చేశారు.
చిన్నారులకు పుస్తకాలు, పలకలు పంపిణీ : కృష్ణా జిల్లా గుడివాడ శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన సరస్వతీ దేవి పూజల్లో స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. చిన్నారులకు పుస్తకాలు, పలకలు పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని వాసవీ మాతకు గ్రామోత్సవం నిర్వహించారు. మడకశిర మండలం చందకచర్లలోని గంగమ్మ ఆలయంలో చండీ హోమం నిర్వహించారు.
లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ - అమ్మవారి సేవలో సినీప్రముఖులు - Dasara Navaratri 2024