Dugarajapatnam Port Construction Work: అన్నొస్తున్నాడు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాడు. ఊరూరా చెప్పండి. వాడవాడా చాటండి. గద్దెనెక్కక ముందు బిగ్గర స్వరంలో మైకులు పగిలేలా జగన్ చెప్పిన మాటలివి. అన్నొచ్చాక ఏమైంది. ఆంధ్రప్రదేశ్ ఆగమైంది. నెల్లూరు జిల్లాలో దుగరాజపట్నం పోర్టు నిర్మించి తీరతామని స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రతినబూనిన జగనన్న, సీఎం పీఠం ఎక్కగానే ఆ మాటే మరిచారు. రాజకీయం, స్వార్థ ప్రయోజనాల కోసం పోర్టును బలిపెట్టారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దుగరాజపట్నం పోర్టు నిర్మాణంపై ప్రతిపక్ష నేత హోదాలో జగన్ శపథం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం పోర్టును కేంద్రమే పూర్తి చేసి రాష్ట్రానికి అప్పగించాలని, ఇందుకోసం ఉద్యమ స్ఫూర్తితో పోరాడతామని చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాకా జగనన్న ఏం చేశారు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణంపై నాలుక మడతేశారు. ఐదేళ్లలో పోర్టుల అభివృద్ధిపై అధికారులతో నిర్వహించిన సమీక్షల్లోనూ ఆ ప్రస్తావనే లేదు.
నెల్లూరు జిల్లాలో దుగరాజపట్నం పోర్టు నిర్మించాలని ప్రతిపాదించిన ప్రదేశం నుంచి వందల ఏళ్ల కిందటే సరకు రవాణా జరిగింది. ఆ తర్వాతే నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం, తమిళనాడులో ఎన్నోర్ పోర్టులు అభివృద్ధి చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణపట్నం పోర్టులో మెజారిటీ వాటాను అదానీ సంస్థ దక్కించుకుంది. ఇక్కడి నుంచి ఏటా సుమారు 30 మిలియన్ టన్నుల సరకు రవాణా జరుగుతోంది.
కడప జిల్లాలోని ఆర్‌టీపీపీ థర్మల్ విద్యుత్ కేంద్రం, నెల్లూరులో కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు రవాణా చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టుకు దగ్గరలోనే మరోటి నిర్మిస్తే, అక్కడి నుంచి నిర్వహించే సరకు రవాణాపై ఎంతో కొంత ప్రభావం ఉండనుంది. ఆ కారణంతోనే ప్రతిపాదనను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పక్కనబెట్టేసిందనే ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణంపై మాత్రమే దృష్టి పెట్టి, దుగరాజపట్నాన్ని విస్మరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Promises To AP: కేంద్రం ఇచ్చిన హామీలు.. రాబట్టడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం
"రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏం చెప్పిందో అది చేయడం లేదు. ఇప్పటికైనా ఇచ్చిన హామీల్లో దుగరాజపట్నం పోర్టు అన్నారు. ఆ పోర్టు నిధులెక్కడ పోయాయో, ఎక్కడ కేటాయించారో తెలియడం లేదు. చట్టంలో పొందుపరిచిన అంశాలను కూడా వీళ్లు చేయడం లేదు." -శ్రీనివాస్, నెల్లూరు కృష్ణపట్నం పోర్టు వర్కర్స్ నేత
దుగరాజపట్నానికి బదులుగా నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం, శ్రీకాకుళంలోని మూలపేట పోర్టుల్లో ఒకదాని నిర్మాణానికి సహకరించాలని కేంద్రాన్ని సీఎం జగన్ కోరారు. అంటే దుగరాజపట్నంలో పోర్టు నిర్మించే ఆలోచన తమకు లేదని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తేల్చి చెప్పినట్లయింది. మరి ఇతర పోర్టుకైనా నిధులు రాబట్టారా అంటే అదీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి జగన్ ప్రభుత్వం ఎస్బీఐ నుంచి 2,500 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని గుత్తేదారులకు బిల్లులు చెల్లిస్తోంది.
నవయుగ జేవికి రామాయపట్నం పోర్టు పనులు
దుగరాజపట్నంలో పోర్టు అందుబాటులోకి వస్తే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరకు రవాణా అవసరాలు చాలా మేరకు తీరుతాయని ఓ సంస్థ స్పష్టం చేసింది. కేంద్రం ప్రతిపాదించిన సాగరమాల ప్రాజెక్టుపై ఆ సంస్థ లోతైన అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా చేపట్టే వివిధ ప్రాజెక్టుల వల్ల ఆయా రాష్ట్రాల్లో రాబోయే ఆర్థిక, సామాజిక స్థితిగతులపై నివేదిక రూపొందించింది. కడప, రాయచూర్ జిల్లాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు రవాణాకు దుగరాజపట్నం పోర్టు అనుకూలమని నివేదికలో పేర్కొంది. కృష్ణపట్నం, చెన్నై పోర్టుపై ఒత్తిడి తగ్గుతుందనీ వెల్లడించింది. పోర్టు మొదటి దశ నిర్మాణానికి 2,742 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది.
దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక తయారీ బాధ్యతను రైట్స్ సంస్థకు కేంద్రం అప్పట్లో అప్పగించింది. ఆ డీపీఆర్‌ల తయారీకి అయ్యే ఖర్చును విశాఖ పోర్టు ట్రస్టు భరించింది. విశాఖ, ఎన్నోర్ పోర్టుల మాదిరే భారీ ఓడల రాకపోకలకు దుగరాజపట్నం అనువైన ప్రాంతమని ఆ సంస్థ నివేదికలో ప్రస్తావించింది. పోర్టు నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతానికి సమీపంలోనే శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం- షార్ ఉంది. పోర్టు నిర్మాణానికి తమకెలాంటి అభ్యంతరం లేదని షార్ ఇచ్చిన నివేదిక మేరకు, కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డీపీఆర్ తయారీకి పచ్చజెండా ఊపింది. మాటలు చెప్పడం ఆ తర్వాత మడమ తిప్పడం అలవాటైన జగనన్న దుగరాజపట్నం పోర్టు సైతం అలాగే అటకెక్కించారు.