HEAVY CROP LOSS IN ANANTHAPUR DISTRICT: మొన్నటి వరకు చినుకు కోసం ఆకాశం వంక ఆశగా చూసిన రైతులు, ప్రస్తుతం వర్షం వద్దని పూజలు చేస్తున్నారు. ఈ మధ్య రాష్ట్రంలో పంటలను తీవ్రంగా నష్టపరిచిన తుపానులు, కరవు జిల్లా రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి. తుపానుల ప్రభావంతో కోసి కుప్పేసిన పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లగా, కోతకు సిద్ధంగా ఉన్న ఖరీఫ్ పంటలు చేతికి రాకుండా పోతున్నాయి. మరో వారం రోజుల్లో పంట కోసి మార్కెట్టుకు తరలించాలని భావించిన రైతులు ఎడతెరిపిలేకుండా కురుస్తున్న అకాల వర్షాలతో పెట్టుబడి కూడా తిరిగిరానంతగా నష్టపోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వరి, కంది సాగుచేసిన రైతులు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారు. అనంతపురం జిల్లాలో అనేక చోట్ల కోసి కుప్పపోసిన ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చి ఎందుకూ పనికిరాకుండా పోయింది.
జగన్ సర్కార్ నిర్లక్ష్యంతో కాలువలు పాయే, పంటల పోయో - YSRCP neglect maintenance of canals
అన్నదాతకు అపార నష్టాలు: తుపాను ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈసారి ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి నైరుతి రుతుపవనాల దోబూచులాటతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వర్షాధారంగా సాగుచేసిన అనేక పంటలకు సకాలంలో వర్షం కురవని కారణంగా రైతులకు దిగుబడి నష్టం ఏర్పడింది. ఖరీఫ్ ఆరంభంలో అనేక ఇబ్బందులతో పంటలను దక్కించుకున్న రైతులు, ప్రస్తుతం పంట నూర్పిడి చేసి మార్కెట్టుకు తరలించే సమయంలో తుపాను ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలు తీవ్రంగా నష్టం చేకూర్చాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 22 వేల హెక్టార్లలో వరిని సాగుచేయగా, కేవలం 30 శాతం మంది రైతులు మాత్రమే పంటను ముందుగానే కోసి మార్కెట్ కు తరలించి అకాల వర్షాల నష్టాన్ని తప్పించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వరి సాగుచేసిన 70 శాతం మంది రైతులు కొందరు పంట నూర్పిడి చేసి ధాన్యం కుప్పపోసుకోగా, మరి కొందరు రైతులు కోతలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ 70 శాతం రైతులంతా అకాల వర్షాలతో అన్నివిధాలా నష్టపోయారు.
ఏనుగుల గుంపు సంచారం- భయాందోళనల్లో స్థానికులు
వరికోత యంత్రాలకు అదనంగా చెల్లింపు: అనంతపురం జిల్లాలో అకాల వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షంతో కోతకు సిద్ధమైన వరి పంట తడిసిపోయి నేలవాలింది. సుమారు వారం రోజులుగా వరి కంకులు నీటిలోనే ఉండటంతో మొలకలొస్తున్నాయి. నేల వాలిన పంటను కోయడానికి వరికోత యంత్రాలకు అదనపు గంటలు చెల్లించాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా ఎకరా విస్తీర్ణంలోని వరిని గంట సమయంలో కోస్తుండగా, పంట నేలవాలినందున అదనంగా గంటన్నర సమయం తీసుకుంటోంది. దీంతో రైతులు వరికోత యంత్రాల నిర్వాహకులకు పెరిగిన గంటన్నర సమయానికి సుమారు ఐదువేల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వరి నూర్పిడి చేసి రోడ్లపైనే ఆరబోసుకున్న రైతులను వరుణుడు తీవ్రంగా నష్టపరిచాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ధాన్యం రాసులపై కప్పిన పట్టలు గాలికి లేచిపోతుండగా, రోడ్లపై వర్షపునీటి ప్రవాహం ధాన్యం కుప్పల కిందకు వెళ్లి ఉత్పత్తి తడిసిపోయింది. అనేక చోట్ల ధాన్యం కుప్పలు మొలకలెత్తి మిల్లు ఆడించడానికి కూడా పనికిరాకుండా పోయింది. అన్ని విధాలా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఉత్తరాంధ్రలో వర్షాలు తగ్గినా వీడని ముంపు - వేలాది ఎకరాల్లో పంట మునక - Floods in Coastal AP
కుదేలైన కంది రైతులు: కంది సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తుపానులు, అల్పపీడనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో నాలుగు సార్లు పూత రాలిపోయింది. కందికి అనేక సార్లు పూత వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటి వరకు రైతులు ఆశగా ఉండగా, చివరిసారిగా పూతతో ఉన్న కంది పంటను తాజాగా కురుస్తున్న తుపాను వర్షాలు పూర్తిగా పూత, పిందెను రాలిపోయేలా చేశాయి. కంది పూత వచ్చే సమయంలో పంట ఆరోగ్యంగా ఉండటంతో ఈసారి అప్పులు తీరేలా కంది దిగుబడులు వస్తాయని రైతులు భావించారు. అయితే ఆది నుంచి ఈ పంటపై పగబట్టిన వరుణుడు కనీసం ముప్పైశాతం పంట దక్కే పరిస్థితి కూడా లేకుండా చేశాడు. వదలకుండా కురుస్తున్న వర్షాలతో కందిని పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షంతో మిరిపకు నష్టం వాటిల్లింది. ఎండు మిరప పూర్తిగా తడిపిపోయి చెట్టు నుంచి నేలకు రాలిపోయింది.వరి, కంది పంటలను తుపాను తీవ్రంగా నష్టపరిచిందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. కోయకుండా ఉన్న వరి, కంది పంటలకు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనావేస్తున్నామని, కోసి కుప్పేసిన పంట తడిసి నష్టం జరిగితే ఇన్ పుట్ రాయితీ పరిధిలోకి తీసుకోవడంలేదని అధికారులు అంటున్నారు.