DSC Notification in AP: తెలంగాణలో 11వేల 62 పోస్టులతో మెగా డీఎస్సీ విడుదలైంది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు 29వేల 571 ఉండగా వీటిలో చదివే విద్యార్థులు 28 లక్షల మంది. 2017లో 8 వేల 792 పోస్టులు భర్తీచేశారు. ఇవికాకుండా గురుకులాల్లో తొమ్మిదేళ్లలో మూడు విడతల్లో 27వేల బోధన పోస్టుల నియామకాలు చేశారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు 44వేల 426 ఉండగా వీటిలో చదివే విద్యార్థులు 38.25 లక్షల మంది. టీడీపీ హయాంలో 18వేలకు పైగా పోస్టులతో రెండు డీఎస్సీలు వేశారు. జగన్ సర్కార్ ఐదేళ్లకు కలిపి 6 వేల 100 పోస్టులనే ప్రకటించింది. తెలంగాణ కంటే ఏపీలో బడులు విద్యార్థులు ఎక్కువే అయినా పోస్టుల సంఖ్య పెరగలేదు. ప్రపంచబ్యాంకు రుణం కోసం వైసీపీ ప్రభుత్వం ఆడుతున్న జగన్నాటకంలో పోస్టులు ఆవిరైపోతున్నాయి.
టెట్, డీఎస్సీ పరీక్షలపై హైకోర్టులో ముగిసిన వాదనలు - తీర్పు రిజర్వు
పక్కనఉన్న తెలంగాణలో టీచర్ ఖాళీలను వెతికి మరీ భర్తీచేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం జగన్ ప్రభుత్వం ఉన్న ఖాళీలను దాచేసి, నిరుద్యోగులను మోసగిస్తోంది. వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ప్రతీ సంవత్సరం డీఎస్సీ నిర్వహించిందా అంటే అదీ లేదు. జగన్ ప్రభుత్వం పెంచిన రెండేళ్ల పదవీ విరమణ వయస్సు గడువు జనవరితో ముగిసింది. రాబోయే నెలల్లో పదవీ విరమణలు విరివిగా ఉంటాయి. కానీ ప్రభుత్వం 6 వేల100 పోస్టులకు డీఎస్సీ ఇచ్చి ఇక ఖాళీలు లేవంటోంది. పైగా ఎన్నికల వేళ హడావిడిగా వెలువరించిన నోటీఫికేషన్లో అభ్యర్దులకు చదువుకునేందుకు సరిపడా సమయాన్ని కూడా కేటాయించలేదు. పరీక్ష అనంతరం అప్రెంటిస్‌షిప్ ఉంటుందని పేర్కొనడం అభ్యర్దుల్లో ఒకింత అసహనాన్ని, గందరగోళాన్ని రేకెత్తించింది. చదువుపై పెట్టే ప్రతిపైసాను పెట్టుబడిగా భావిస్తానని, ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడాలని సీఎం జగన్ తరచూ సభల్లో ఊదరగొడుతూ ఉంటారు. పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేకపోతే గ్లోబల్ విద్యార్థులు ఎలా తయారవుతారు.? ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పెట్టుబడి కాదా? అన్న విమర్శలు వస్తున్నాయి.
డీఎస్సీకి అభ్యర్థులకు జగన్ సర్కార్ షాక్ - మరోసారి రుసుము కట్టాలని సూచన
గోబెల్స్‌ను మించి ప్రచారం: తెలంగాణలో ప్రతి పంచాయతీలో కనీసం ఒక పాఠశాల ఉండాలనే నిబంధనను అక్కడి ప్రభుత్వం పెట్టింది. బడులు లేకపోతే కొత్తవాటిని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. పేద పిల్లలకు బడులను ఇంటికి సమీపంలో ఉంచేలా చూస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం బడుల నిర్వహణలోనూ రివర్స్ విధానం పాటిస్తోంది. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5తరగతులను కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించింది.
ప్రాథమిక బడుల్లో విద్యార్థులు తగ్గిపోయి వాటికవే మూతపడుతున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 587 ప్రభుత్వ బడులు మూతపడ్డాయి. విలీనం కారణంగా 118 బడులకు తాళాలు వేశారు. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ బడుల సంఖ్య 9 వేల 602కు పెరిగింది. మూతపడుతున్న వాటిలో ఎక్కువగా ఎస్సీ కాలనీలు, ఎస్టీల ఆవాసాల్లో ఉన్నవే. ఇదే పరిస్థితి కొనసాగితే ఎస్సీలు, గిరిజనులకు ప్రాథమిక విద్య దూరమవుతుంది. ఇంత జరుగుతున్నా జగన్ సర్కార్ మాత్రం మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌తో బోధనంటూ గోబెల్స్‌ను మించి ప్రచారం చేస్తోంది.
మెగా డీఎస్సీ కోసం మంత్రి గుడివాడ అమరనాథ్ ఇంటి ముట్టడి - న్యాయం చేయాలంటూ నినాదాలు
ఒక్కోసారి ఒక్కో ప్రకటన: ఉపాధ్యాయ ఖాళీలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్కోసారి ఒక్కో మాట చెప్తూ బుకాయించారు. పాఠశాలల్లో 771 పోస్టులే ఖాళీగా ఉన్నాయని, పదవీవిరమణ వయసు 62ఏళ్లకు పెంచడం వల్ల ఖాళీలేమీ రాలేదని గతేడాది మార్చి 20న శాసనమండలిలో ప్రకటించారు. తర్వాత గతేడాది సెప్టెంబరు 22న 8 వేల 366 పోస్టులు అవసరమని, వాటి భర్తీకి చర్యలు తీసుకుంటామని ప్రశ్నోత్తరాల్లో సమాధానమిచ్చారు.
ఈ సమయంలోనే లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో లక్షా 88 వేల 162 పోస్టులు ఉంటే పనిచేస్తున్న వారు లక్షా 69వేల 642 ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల డీఎస్సీ ప్రకటన సమయంలో 6వేల 100 పోస్టులు ప్రకటించి ఏప్రిల్ వరకు వచ్చే ఖాళీలన్నీ కలిపితేనే ఈ పోస్టులు వచ్చాయన్నారు. మంత్రి బొత్స చేసిన ప్రకటనల్లో ఒకదాంతో మరోదానికి సంబంధమే లేదు. ఎన్నికలకు నెల ముందు డీఎస్సీ వేసి, తగిన సమయం ఇవ్వకుండా నిరుద్యోగులను చిత్రహింసలు పెడుతున్నారు.