Drinking Water Schemes Damaged : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో అత్యధిక గ్రామాలకు మున్నేరు నుంచే తాగునీరు అందుతోంది. దీని పరివాహకంలో ఏర్పాటు చేసిన సామాజిక రక్షిత నీటి పథకాల ద్వారా గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. వీటితో పాటు పలు గ్రామాలకు ప్రత్యేక పథకాలు ఉన్నాయి. గత వారం మున్నేరుకు వచ్చిన 3 లక్షల క్యూసెక్కుల వరద. ఏటిగట్టున ఉన్న పథకాల పంపుహౌస్‌లను ముంచేసింది. అనుసంధానంగా ఉన్న పైపులైన్లు, మోటార్లు పాడైపోయాయి.
Munneru Flood in NTR District : ఫలితంగా మున్నేరు ఒడ్డున ఉన్న చిల్లకల్లు, లింగాల, ఇందుగుపల్లి, పోలంపల్లి కొళ్లికూళ్ల, కంభంపాడు పథకాల పరిధిలోని గ్రామాలకు నీటి సరఫరా 13 రోజులుగా నిలిచిపోయింది. పెనుగంచిప్రోలు మండంలోని పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు, శివాపురం, జగ్గయ్యపేట మండలంలోని ఆగ్రహారం, బూదవాడ, అన్నవరం, రావిరాల గ్రామాలకు ఉన్న పథకాలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు. వీటిని తక్షణమే మరమ్మతులు చేసి తాగనీటిని పునరుద్ధరించాలని స్థానికులు వేడుకుంటున్నారు.
బుడమేరు వరదతో పత్తి పంట నాశనం - ఆత్మహత్యే శరణ్యమంటున్న రైతులు - COTTON CROP DAMAGE DUE TO FLOODS
మున్నేరులో ప్రధానంగా లింగాల వద్ద చిల్లకల్లు, లింగాల, వత్సవాయి తాగునీటి పథకాలు ఉన్నాయి. ఇక్కడ వరద దెబ్బకు కరెంట్ స్తంభాలు, పంపుహౌస్‌లోని మోటార్లు ధ్వంసమయ్యాయి. వీటి పక్కనే ఉన్న లింగాల వంతెనపై నుంచి వరద పారడంతో దానిపై ఉన్న మంచి నీటి పైపులైన్లు కొట్టుకుపోయాయి. పోలంపల్లి, ఇందుగు పల్లి వద్ద విద్యుత్తు లైన్లు దెబ్బతిన్నాయి. కొళ్లికూళ్ల పథకం వద్ద స్తంభాలు నేలవాలి తీగలు తెగిపోయాయి. పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు, శివాపురం గ్రామాల పంపుహౌస్ వద్ద వందల మీటర్ల మేర ఇదే పరిస్థితి నెలకొంది.
పెనుగంచిప్రోలు గ్రామానికి తాగునీరు అందించే పథకం ఏటికి అవతలి వైపు ఉంది. సుమారు కిలోమీటరు మేర మున్నేరులో నుంచి ఉన్న పైపులైను గతేడాది వరదలకే పలుచోట్ల ధ్వంసం అయింది. అంతకంటే భారీ వరద రావడంతో పైపులైను పటిష్టతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరదల తాకిడికి కకావికలమైన రక్షిత తాగునీటి పథకాలను అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. తమ ప్రాంతానికి కేంద్ర బృందం వచ్చి ఉంటే నష్టం కళ్ల ముందు కనిపించేదన స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
దెబ్బతిన్న లింగాల వంతెన - కొట్టుకుపోయిన కాంక్రీట్ స్లాబులు - Lingala Bridge Damaged