Drinking Water Scarcity in Ongole RIMS Hostels: ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య కళాశాలల్లో ఒంగోలు కళాశాల ఒకటి. నీట్ ద్వారా ర్యాంకులు సాధించి ఇక్కడ సీట్లు దక్కించుకున్న విద్యార్థులు వసతి గృహాల్లో ఉండాలంటే సమస్యలతో సహవాసం చేయాల్సి వస్తోంది. దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి సీట్లు సంపాదించుకున్న వైద్య విద్యార్థులు వైద్యశాల ప్రాంగణంలోనే తప్పని సరిగా వసతి ఉండాలి. ఇందుకోసం ప్రభుత్వం వసతి గృహాలను సైతం నిర్మించింది. అయితే వైద్య విద్యార్థులు, పీజీ విద్యార్థులు, సీనియర్ డాక్టర్లు, బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు, ప్రొఫెసర్లు వెరసి దాదాపు వెయ్యి మంది వరకూ కళాశాల ఆవరణలో ఉన్న వసతి గృహాల్లో నివాసముంటున్నారు.
వీరంతా ఇక్కడ ప్రధానంగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. దీనికి తోడు ఆసుపత్రిలో కూడా ఇదే సమస్య. రోగులకు, వైద్య సిబ్బందికి అవసరమైన నీటిని పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్షం చూపుతోంది. మున్సిపల్ వేసవి చెరువు నుంచి కళాశాల, ఆసుపత్రికి సరఫరా కావాల్సిన నీరు నిలిచిపోయింది. ఒకటో వేసవి చెరువు నుంచి ఆసుపత్రిని కలుపుతూ ఏర్పాటు చేసిన పైపులైన్ కూడా దెబ్బతిని నీరు రావడం లేదు.
విధి లేని పరిస్థితిల్లో ప్రస్తుతం పాత రిమ్స్ ఆవరణలో వేసిన బోర్వెల్ నుంచి వచ్చే నీరే దిక్కైంది. అయితే అవి కూడా పూర్తి స్థాయి అవసరాలు తీర్చలేకుంది. దీంతో వసతి గృహాల్లో ఉంటున్న వైద్య విద్యార్థులు, ఆసుపత్రి ఆవరణలోని సిబ్బంది, క్యార్టర్స్‌లో వారికి నిత్యం క'న్నీటి' కష్టాలు తప్పడం లేదు. స్నానాలు, మరుగుదొడ్లకూ నీరు దొరక్క చెప్పుకోలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జల్ జీవన్ మిషన్ పథకానికి నిధులివ్వరు - ప్రజలకి నీళ్లు అందవు - ఇలా అయితే ఎలా జగనన్నా!
సర్వజన ఆసుపత్రి, వైద్యకళాశాలకు కలిపి రోజువారి 8 లక్షల లీటర్లు అవసరమైతే ప్రస్తుతం 4 లక్షల లీటర్లు మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా పాత రిమ్స్‌లోని బోర్వెల్ నుంచి తీసుకుంటున్నారు. నగరపాలక సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం వేసవి చెరువు నుంచి రోజువారీ 4 లక్షల లీటర్లు ఇవ్వాల్సి ఉంది. మరో మూడు లక్షల లీటర్లు పాత రిమ్స్ బోర్వెల్ నుంచి లభిస్తుంది. వీటితో అవసరాలు తీరతాయని అప్పట్లో అంచనా వేశారు. కానీ ఇది సాధ్యపడలేదు.
బీఎస్సీ నర్సింగ్ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో ఇప్పటి వరకు జేడీ శీలం భవన్లో తాత్కాలికంగా నిర్వహించారు. ఇటీవల భవనం దెబ్బతిని ఉండటానికి వీల్లేకపోవడంతో ఆసుపత్రి మూడో అంతస్తులోని గదులను నర్సింగ్ విద్యార్థుల వసతికి కేటాయించారు. దాదాపు 200 మంది నర్సింగ్ విద్యార్థులు ఉండటంతో నీటి వాడకం పెరిగింది.
చెరువు నుంచి ఆసుపత్రి వరకు వేసిన పాత పైపులైన్ పాడైపోవడం వలన కొత్తది ఏర్పాటు చేయడానికి రూ. 10 లక్షలు అవసరమని అంచనా వేశారు. నిధులు లేక ఈ పనులు చేపట్టలేదు. ఆసుపత్రి లోపల అంతర్గత పైపులకు మరమ్మతులు, నీటినిల్వ ట్యాంకుల నిర్మాణం ఇతరత్రా పనులకు రూ.3 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి టెండర్లు పిలిచారు. ఇప్పటివరకు నాలుగుసార్లు పిలిచినా బిల్లులు రావనే భయంతో గుత్తేదారులెవరూ ముందుకు రావడం లేదు. అధికారులు స్పందించి కనీసం ట్యాంకర్లతోనైనా నీరు అందించాలని విద్యార్థులు కోరుతున్నారు.
'ఓట్లు వేయించుకుని వదిలేశారు' - మూడు నెలలుగా తాగునీటికి అల్లాడుతున్న జనం